పోలీసు బాస్ ఎవరో?
ముగ్గురు ఐపీఎస్‌లతో యూపీఎస్సీ ఫైనల్ ప్యానెల్..
డీజీపీ రేసులో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా
క్లైమాక్స్‌కు చేరిన నియామక ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన జాబితా
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయమే కీలకం..
వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి
వారంలోపే నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి ౨౧ (విజయక్రాంతి): రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ డీజీపీ నియామక ప్రక్రియ ఎట్టకేలకు తుది అంకానికి చేరుకుంది. రాష్ట్రానికి మూడో పూర్తి కాలపు డీజీపీని ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం కీలక అడుగు వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను నిశితంగా పరిశీలించిన యూపీఎస్సీ, ముగ్గురు అధికారులతో కూడిన హాట్ లిస్ట్‌ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా ప్రత్యుత్తరం పంపింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఈ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం నూతన డీజీపీగా ఎంపిక చేయనుంది.
యూపీఎస్సీ ఖరారు చేసిన ముగ్గురు అధికారుల జాబితాలో అత్యంత సీనియారిటీతో పాటు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న అధికారులకు చోటు దక్కింది. ఈ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా, ఏసీబీ డీజీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉండటమే కాకుండా, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల నిర్వహణలో మంచి పట్టు ఉంది. ఇక రెండో పేరుగా 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే నిలిచారు.
ఈయన ప్రస్తుతం కేంద్ర సర్వీసులలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అత్యంత కీలకమైన స్పెషల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. జాతీయ భద్రత, నిఘా వర్గాల్లో ఈయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండటంతో ప్రభుత్వం ఈయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.అదేవిధంగా 1994 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా పేరు కూడా ఈ తుది జాబితాలో ఉంది.
క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరుగా నిలిచే సౌమ్యా మిశ్రా.. తెలంగాణ డీజీపీ రేసులో నిలిచిన తొలి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే సర్వాధికారాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంటాయి. ముఖ్యమంత్రి తన ప్రాధాన్యతలు, రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎదుర్కో బోయే భద్రతా సవాళ్లు, అధికారుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక పేరును ఖరారు చేస్తారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, పరిపాలనపై పూర్తి పట్టు ఉన్న అధికారిని ఎంపిక చేస్తారా లేక కేంద్రంలో విశేష అనుభవం ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
రాష్ట్ర డీజీపీగా నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా సేవలందిస్తున్న శివధర్ రెడ్డి పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఆయన పదవీ విరమణ సమయానికి కొత్త డీజీపీ సిద్ధంగా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధం గా అడుగులు వేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఈ జాబితాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుది పేరును ప్రక టించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక నియామక ఉత్తర్వులు వచ్చే వారం లోపు వెలువడతాయని సచివాలయ వర్గాలు ధృవీకరించాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో గత కొంతకాలంగా అనేక మార్పులు వస్తున్న తరుణంలో, కొత్త దళాధిపతి పగ్గాలు ఎవరు చేపడతారన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.




