14-02-2026 12:00:00 AM
భారతదేశంలో వైద్యం అనేది ప విత్రమైన వృత్తిగా పరిగణించబడుతుంది. కానీ నేడు వైద్యం అనేది లాభాలే పరమావధిగా సాగే ఒక క్రూరమైన వ్యాపార సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. ఈ విషయాన్ని స్వయంగా భారత పార్లమెంటరీ కమిటీ అంగీకరించడాన్ని చూస్తే దేశ ఆరోగ్య వ్యవస్థ ఎంత దిగజారిందనేది తెలియజేస్తోంది. ఇటీవలి కాలంలో వెలువడుతున్న పరిశోధనాత్మక నివేదికలు భారత ఆరోగ్య రంగం కుప్పకూలే అంచున ఉందని హెచ్చరిస్తున్నాయి.
ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు, ఫా ర్మా కంపెనీల మధ్య సాగుతున్న అనైతిక ఒప్పందాలు సామాన్య పౌరుల ప్రాణాలను, వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతుల ను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల గణాంకాల ప్రకా రం, దేశంలో జరుగుతున్న మానవ శస్త్ర చికిత్సల్లో సుమారు 44 శాతం నకిలీవి, మోసపూరితమైనవిగా తేలడం బాధాకరం.
దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో జరుగుతున్న ఈ శస్త్ర చికిత్సల వివరాలను నిశితంగా పరిశీలిస్తే, అత్యంత సున్నితమైన గుండె సంబంధిత చికిత్సల్లో దాదాపు 55 శాతం వరకు అనవసరమైన ఆపరేషన్లు జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్నపాటి చికిత్సతో నయమయ్యే సమస్యలకు కూడా స్టెంట్లు వేయడం లేదా బైపాస్ సర్జరీల అవసరం ఉందని రోగులను భ యపెట్టి ఆపరేషన్ థియేటర్లకు తరలిస్తున్నారు. అన్ని రంగాల్లో మార్కెట్ శక్తుల ప్రాబల్యం పెరిగినట్లుగానే, వైద్యరంగంలోకి కూడా మార్కెట్ శక్తులు ప్రవేశించా యి. దీనివల్ల వైద్యుడుేొరోగి అనే సం బంధం పోయి, వైద్యం ఒక సరుకుగా మారింది.
వైద్య రంగానికి సంబంధం లేనివారు కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులను నెలకొల్పుతున్నారు. వీటిలో లాభాపేక్ష తప్ప, సేవాభావం లే దు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉదంతం ఇం దుకు సజీవ సాక్ష్యం. ఈ సంతాన సౌఫల్య కేంద్రం పిల్లలు లేని జంటల కోరికపై ఏ స్థాయిలో వ్యాపారం చేసిందో, ఎంత అనైతిక పద్ధతులను పాటించిందనేది అందరికీ తెలిసిందే.
నైతికతకు పాతర..
ఈ విధమైన దోపిడీ మహిళల ఆరో గ్యం విషయంలో కూడా కొనసాగుతోంది. గర్భాశయ సమస్యలతో వచ్చే మహిళల్లో సుమారు 48 శాతం మందికి ఆ అవయవాన్ని తొలగించాల్సిన అవసరం లేకపో యినా, హిస్టరెక్టమీ శచికిత్సలు నిర్వహించి వారి సహజ శారీరక సమతుల్యతను దెబ్బతీస్తున్నారు. అలాగే క్యాన్సర్ ఆపరేషన్ల విషయంలో 47 శాతం, మోకాళ్ల మార్పిడి సర్జరీల్లో 48 శాతం, సిజేరియన్ డెలివరీల్లో 45 శాతం వరకు కేవలం ఆదాయం కోసమే ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
కార్పొరేట్ ఆసుప త్రుల పనితీరులో వస్తున్న ఈ మార్పులకు వైద్యులపై ఉన్న టార్గెట్ల ఒత్తిడే ప్రధాన కార ణం. ప్రస్తుతం పెద్ద ఆసుపత్రుల్లో సీనియ ర్ వైద్యులకు నెలకు రూ. కోటి వరకు జీ తం ఇస్తున్నారంటే, అది వారి ప్రతిభకు మాత్రమే కాదు, వారు ఆసుపత్రికి తెచ్చే వ్యాపారానికి ఇస్తున్న ప్రతిఫలం అని కూడా చెప్పవచ్చు. ఎక్కువ టెస్టులు రాయ డం, ఎక్కువ మందిని అడ్మిట్ చేయించ డం లేదా అనవసరమైన ఆపరేషన్లు సూ చించే వైద్యులకే యాజమాన్యాలు పెద్దపీట వేస్తున్నాయి.
దీనివల్ల వైద్యులు నైతిక విలువలను పక్కనపెట్టి కేవలం ఆదాయం కోస మే పనిచేసే యంత్రాలుగా మారిపోతున్నా రు. ప్రతి రక్త పరీక్ష, స్కాన్ లేదా ఎక్స్-రే వెనుక 40 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఉండటం, రోగికి ఉన్న సమస్య కంటే అతని జేబులో ఎంత డబ్బు ఉందన్న దా నిపైనే ఆసుపత్రులు దృష్టి పెట్టడం దురదృష్టకరం. దేశంలోని సుమారు 2 లక్షల ల్యాబరేటరీల్లో కేవలం వెయ్యి ల్యాబ్‌లు మాత్రమే సరైన గుర్తింపు కలిగి ఉండటం వ్యవస్థలోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నది.
కమీషన్ల కక్కుర్తి..
మరోవైపు, హెల్త్ ఇన్సూరెన్స్ రంగం కూడా ఈ దోపిడీకి ఒక వేదికగా మారింది. దేశంలో సుమారు 68 శాతం మందికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ, అవసరమైనప్పుడు క్లెయిమ్ తిరస్కరించబడటం లేదా స్వల్ప మొత్తమే చెల్లించడం జరుగుతోంది. అనేక కార్పొరేట్ ఆసుపత్రులు నకిలీ బిల్లులతో ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేస్తూ ఇప్పటికే 3 వేల వరకు ఆసుపత్రులు బ్లాక్‌లిస్ట్ అయ్యాయి. మరణించిన రోగులను సైతం బతికే ఉన్నారని నమ్మించి, రోజులకు రోజులు వెంటిలేటర్లపై ఉంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఉదంతాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ టేబుల్ మీద రోగి మరణించినా, కుటుంబ సభ్యులకు ఆ విషయం చెప్పకుండా తక్షణమే డబ్బు కట్టాలని ఒత్తిడి చేసి, ఆ తర్వాత మరణించినట్లు ప్రకటించే దారుణాలు నిత్యకృత్యమైపోతున్నాయి. అవయవ మా ర్పిడి రంగంలో సాగుతున్న అక్రమ రవా ణా ఈ అరాచకానికి పరాకాష్ట. ఉద్యోగాల పేరుతో లేదా ఉచిత ఆరోగ్య పరీక్షల పేరు తో నిరుపేదలను ఆసుపత్రులకు తీసుకువెళ్లి, వారికి తెలియకుండానే కిడ్నీలు వంటి కీలక అవయవాలను దొంగిలిస్తున్న అంతర్జాతీయ ముఠాలు దేశంలో పాగా వేశా యి.
దీనికి తోడు రిఫరల్ మోసం అనే ప్రక్రియ ద్వారా ప్రాథమిక వైద్యులు రోగులను పెద్దాసుపత్రులకు పంపిస్తూ భారీగా కమీషన్లు దండుకుంటున్నారు. రోగి పరిస్థితి ఎలా ఉన్నా, తమకు వచ్చే కమీషన్ పైనే చాలా మంది దృష్టి పెడుతున్నారు. ప్రముఖ ఆసుపత్రులు 40 నుంచి 75 మంది వరకు రోగులను పంపిన వైద్యులకు రూ. లక్ష నుంచి 2.50 లక్షల వరకు రివార్డులు, విదేశీ పర్యటనలు ఆఫర్ చేస్తున్నాయంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మార్పు అవసరం!
మరోపక్క ఔషధ కంపెనీల పాత్ర కూ డా తక్కువ ఏమీ కాదు. సుమారు 25 పెద్ద ఔషధ కంపెనీలు ప్రతి సంవత్సరం రూ. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వైద్యులపై ఖర్చు చేస్తున్నాయి. బ్రాండెడ్ మందు లను ప్రమోట్ చేయడానికి కంపెనీలు వై ద్యులకు ఖరీదైన బహుమతులు, లగ్జరీ జీవితాలను ఆశగా చూపుతున్నాయి. ఆసుపత్రులు తక్కువ ధరకే మందులు కొనుగో లు చేస్తున్నాయి. కానీ అదే మందులను రోగులకు మాత్రం 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తూ భారీ లాభాలు గడిస్తున్నాయి.
ఉదాహరణకు ఒక క్యాన్సర్ మందును ఆసుపత్రి రూ.1,950కు కొనుగోలు చేస్తే, రోగికి మాత్రం రూ. 18,645కు విక్రయిస్తున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి నియంత్రణ సంస్థలు ఉ న్నప్పటికీ, అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగు తున్న ఈ దోపిడీని అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. నిబంధనల ప్రకా రం వైద్యులు కేవలం జనరిక్ మందులే రాయాలి, చికిత్సకు ముందు ఫీజు వివరాలు ఖచ్చితంగా వెల్లడించాలి అని నిబం ధనలున్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదు.
ఈ మొత్తం వ్యవస్థలో బలైపోతున్నది మాత్రం సామాన్య పౌరులే. ప్రభు త్వం కేటాయించే ఆరోగ్య పథకాలు కూడా అవినీతి అధికారులు, ఆసుపత్రి యాజమాన్యాల చేతుల్లో చిక్కి నిరుపయోగంగా మారిపోతున్నాయి. ప్రజలు తమను తాము రక్షించుకోవాలంటే వైద్యం పట్ల కనీస అవగాహన పెంచుకోవాలి. అనవసర పరీక్షల గురించి ప్రశ్నించడం, శస్త్ర చికిత్సలకు ముందు మరో నిపుణుడి అభిప్రాయాన్ని తీసుకోవడం, జనరిక్ మందుల కోసం పట్టుబట్టడం వంటి చర్యలు కొంతవరకు మేలు చేస్తాయి.
ఆరోగ్య హక్కును వ్యాపార వస్తువుగా మార్చిన ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే చట్టాలు కఠినతరం కావడమే కాకుండా, సామాన్య ప్రజల గొంతు కలు కూడా ఏకమవ్వాలి. ఈ విస్తుపోయే నిజాలు ప్రతి ఒక్కరికీ చేరినప్పుడే వ్యవస్థలో కదలిక వస్తుందని గ్రహించాలి. అక్రమాలపై పాలకులు దృష్టి సారించి పరి స్థితి చక్కదిద్దాలి. ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసి ప్రైవేట్ వైద్యాన్ని నియంత్రించాలి. వైద్య రంగంలో జరుగుతున్న నకిలీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
వ్యాసకర్త సెల్: 9848559863
వెంకగారి భూమయ్య