28-10-2025 12:00:00 AM
జనగామ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): వివిధ సమస్యల పై ప్రజలు ఇచ్చే వినతులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బెన్ష లోమ్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు.. వారి సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... గ్రీవెన్స్ దరఖాస్తులలో ఎలాంటి పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు.
ఈనాటి గ్రీవెన్స్ కి మొత్తం 71 దరఖాస్తులు రాగా.. అందులో కొన్నింటి వివరాలు.. జనగామలో నివసిస్తున్న గాడి పల్లి దయానంద రెడ్డి అనే అతనికి సంబంధించిన భూమి.. రెవెన్యూ రికార్డులో తక్కువగా నమోదు అయినదని వినతి దరఖాస్తు చేసుకున్నాడు. బచ్చన్నపేటకు చెందిన మార్క్ కిషన్ అనే వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కొంతమంది ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని... దీనిపైతగు చర్యలు తీసుకువాలని కోరారు.
బచ్చన్నపేట గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయస్సు గల అహ్మద్ బాబా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ట్రైనింగ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తేజస్విని, ఆర్డిఓ గోపిరామ్, డిఆర్డిఓ వసంత, కలెక్టరేట్ ఏవో వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.