calender_icon.png 7 February, 2026 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో భారీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం

07-02-2026 07:07:59 PM

* పారిశ్రామిక హబ్‌గా ఆదిలాబాద్‌ ను తీర్చిదిద్దుతాం

* జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, దీని ద్వారా నిరుద్యోగులకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా చెప్పారు. జిల్లాలో ఉన్న అపారమైన పారిశ్రామిక సామర్థ్యాన్ని వినియోగించి, రాబోయే రోజుల్లో కీలక పారిశ్రామిక కేంద్రంగా ఆదిలాబాద్ ను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. శనివారం స్థానిక మంగళమూర్తి కన్వెన్షన్ హాల్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ఇండస్ట్రియల్ పొటెన్షియల్ ఆఫ్ ఆదిలాబాద్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఖర్చులు, సబ్సిడీల వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రవాణా సౌకర్యాల మెరుగుదలలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు, ఇందుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందన్నారు. పత్తి ఉత్పత్తి ఎక్కువగా ఉండే జిల్లాగా ఆదిలాబాద్‌కు కాటన్ ఆధారిత పరిశ్రమలకు మంచి అవకాశాలున్నాయని, పత్తి వ్యర్థాల నుంచి బ్రిక్వెట్స్, పెల్లెట్స్ తయారు చేసే గ్రీన్ ఇండస్ట్రీలకు జిల్లా అనుకూలమన్నారు.

అలాగే కుంటాల, పొచ్చెర జలపాతాలు, నాగోబా ఆలయాన్ని కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. స్థానిక స్వయం సహాయక సంఘాలు తయారు చేసే డోక్రా ఆర్ట్ వంటి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు డిజిటల్ మార్కెటింగ్ వినియోగించాలని సూచించారు. ఐటీ టవర్ పూర్తితో సాఫ్ట్‌వేర్ రంగంలో జిల్లా ముందడుగు వేస్తుందని, స్థానిక యువతకు ఐటీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.ఐ ప్రతినిధులు శివప్రసాద్ రెడ్డి, సంజీవ్ దేశ్‌పాండే, సురేందర్ రావు, సమీఉద్దిన్, గౌతమ్ రెడ్డి, స్థానిక పరిశ్రమల సంఘాల సభ్యులు, గిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.