5 June, 2026 | 5:36 PM

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

05-06-2026 04:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ గిరిజన సంక్షేమ శాఖలో ఔట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వాడ్య శ్రీధర్ బాబు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఉద్యోగి మరణం  పట్ల నిర్మల్ జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జె.ఎ.సి తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కలెక్టరేట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రీధర్ బాబు ఆత్మహత్యకు నిరసనగా నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా జె.ఎ.సి జిల్లా అధ్యక్షులు రాహుల్ రాజ్, జనరల్ సెక్రెటరీ వినోద్ కుమార్ లు సంయుక్తంగా మాట్లాడుతూ, మృతుడి భార్య ఫిర్యాదును బట్టి చూస్తే కార్యాలయ సంబంధిత వేధింపులు, తీవ్ర మానసిక ఒత్తిళ్లే ఈ దారుణ ఘటనకు కారణమనే ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఘటనపై పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించి వాస్తవాలను వెలికితీయాలని వారు డిమాండ్ చేశారు.ఆయన కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై సమంత అధికారుల వేధింపులను వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు

శ్రీధర్ బాబు మరణ ఘటనపై ఉన్నత స్థాయి, లోతైన దర్యాప్తు జరిపించాలని, విధుల్లో వేధింపులకు గురిచేసి ఆయన ఆత్మహత్యకు కారణమైన బాధ్యులైన అధికారులపై కఠిన శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాహుల్ రాజ్, వినోద్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, సంపాదకుడిని కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉన్న మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, దాంతో పాటు ఆ కుటుంబంలో ఒక అర్హుడైన సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని వారు కోరారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై కొందరు అధికారుల వేధింపులు, మానసిక ఒత్తిళ్లు, అవమానకర ప్రవర్తన రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు