4 May, 2026 | 6:59 PM

‘సర్’కు నిరసనలు !

26-07-2025 12:00 AM

బీహార్ అసెంబ్లీలోని 243 అసెంబ్లీ స్థానాలకు కొద్దినెలల్లో ఎన్నికలు జరుగనుండగా, ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. బీహార్‌లో దాదాపు 78.9 మిలియన్ల ఓటర్లను గుర్తించినట్లు ఎన్నికల కమిషన్ తాజా గణాంకాలు పేర్కొన్నాయి. ఇందులో 5.23 మిలియన్ల ఓటర్ల జాడ తెలియడం లేదు.

వారిలో మరణించిన వారెందరు, వలస పోయినవారు ఎందరనేది తేలాల్సి వుంది. 1.86 మిలియన్ల మంది మరణించి వుంటారని, 2.6 మిలియన్ల మంది శాశ్వతంగా వలసపోయి ఉంటారని ఎన్నికల కమిషన్ భావిస్తున్నది. ఆధార్, వాహన లైసెన్స్ కార్డు, రేషన్ కార్డు తదితరాలు ఈసారి ఓటర్ల జాబితా సవరణకు పనికి రావని, తాము ప్రకటించిన 11 డాక్యుమెంట్లలో ఏదో ఒక ఒకటి వుంటేనే, ఓటర్ల జాబితాకు ఎక్కుతారంటూ ఎన్నికల కమిషన్ తెచ్చిన ‘సర్’ విధానం వివాదాస్పదంగా మారింది.

మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఓటర్ల జాబితా సవరణకు సాధారణంగా అనుసరించే పద్ధతి కాకుండా ఎన్నికల కమిషన్ తన పరిధిని అతిక్రమించి, పౌరసత్వాన్ని నిర్ధారించే పనిని తలెత్తుకోవడమే ఈ వివాదానికి కారణమైంది. ఓటర్లు రాజ్యాంగ హక్కుగా ఓటు వేయడాన్ని ‘సర్’ నిరోధిస్తున్నదని, ఇది బీజేపీ పాలిత అస్సాంలో తలపెట్టిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్సీ)కి నకలుగా వుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బీహార్‌లో తమకు అనుకూలంగా ఫలితాలు రాబట్టేందుకే బీజేపీ చాపకిందం నీరులా ‘సర్’ను ప్రవేశపెట్టిందని, ఇది అనేక మంది దళిత, గిరిజన వర్గాల ఓటు హక్కును కాలరాయడమేనని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు ‘సర్’కు నిరసనగా ప్రతిరోజు ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నాయి.

దాదాపు కోటి 40 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించి, తిరిగి తమ కూటమి ప్రభుత్వం బీహార్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. బీహార్ ఓటరు జాబితా సవరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ముందు ప్రతిపక్ష ఎంపీలతో కలిసి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ‘సర్’ పేపర్లను చెత్తబుట్టలో వేశారు. ఓటర్ల జాబితాను ఎన్డీఏకు అనుకూలంగా మార్చడానికి ఎన్నికల సంఘం పనిచేస్తున్నదని,

ఈ పరిస్థితుల్లో బీహార్‌లోని ‘మహా ఘట్బంధన్’ రాబోయే రాష్ట్ర ఎన్నికలను బహిష్కరించే అవకాశం లేకపోలేదని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించడం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. ఓటర్లు ప్రభుత్వాన్ని ఎంచుకోవడం సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఓటర్లను ఎంచుకుంటోందని తేజస్వీ వ్యాఖ్యానించారు. అయితే ‘సర్’ను సమర్థించుకొంటున్న ఎన్నికల కమిషన్, ఎన్నికల్లో స్వచ్ఛతను పెంచేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకొంటున్నది.