26-07-2025 12:00:00 AM
చిత్రమేమంటే నాకు వారు సమర్పించిన నూతన వస్త్రాలతోపాటు మంచి వెల గల చీర కూడా ఉంది. ‘ఇదేమిటని నేను ఒంటరిని కదా! నా అర్ధాంగి ప్రమీల దివంగతురాలై ఆరేళ్లయింది’ అన్నాను. ‘ఇది మా సంప్రదాయం. ఆమె ఉన్నా లేకున్నా ఈ విధంగా ఆమెను సన్మానించుకోవడం మా పుణ్య విశేషం’ అంటూ శర్మ దంపతులు నన్ను సత్కరించారు. అప్పుడు నిజంగా నా కళ్లు చెమ్మగిల్లాయి.
ప్రతిభావంతులే ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు. అందరూ ప్రతిభావంతులు కానట్లే, ప్రతిభను గుర్తించేవారు కూడా కాలేరు. విద్యావంతునికి దూరదేశం లేదని నానుడి. కానీ విద్యావంతుణ్ణి గుర్తించేవారు స్థానికంగా ఉంటే, అతనికి ఏనుగెక్కినంత ఆనందమవుతుంది. నేను 16 మార్చి 2021 నాడు కాగ జ్‌నగర్‌కు వెళ్లాను. కార్లో నన్ను తుమ్మూరి రామ్మోహన్ గారు తీసుకెళ్లారు. పద్యకవి లక్ష్మీరాజయ్య గారు రచించిన ‘విప్లవ వీరు డు అల్లూరి సీతారామరాజు’ పుస్తకావిష్కరణ, దానికి నేను ముఖ్యఅతిథిని. ఐదుగం టలు ప్రయాణించి నేరుగా సభాస్థలికి వెళ్లాను.
మధ్యాహ్నం అవుతుంది. వేదికనలంకరించినవారు లేరు. బ్యానర్ కట్టిన వారు లేరు. ఆకలేస్తుంది. ఆహూతుల సంఖ్య తక్కువగానే ఉంది. నిర్వాహకులు నా దగ్గరికి వచ్చి భోజనానంతరం కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. నేను సరే అన్నాను. అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఒక కవీశ్వరుడు. అతడే పెండ్యాల కిషన్‌శర్మ. శర్మగారి గురించి లోగడ విన్నాను. అతడు పరమభాగవతోత్తముడు.
భాగవతం చదివితే బాగవుతాం అనే పూర్ణ విశ్వాసం అతనిది. నాకు చిన్నప్పటి నుంచి పద్య కవులంటే ఎక్కువ మక్కువ. కిషన్‌శర్మ గారు.. పద్యకవి కనుక నాకు వారి పట్ల గౌరవం కల్గింది. తెలంగాణలో ఉన్న ప్రముఖ పద్యకవుల్లో కిషన్ శర్మగారొకరు. వారు సంస్కృత కావ్యాలను కూలంకషంగా అధ్యయనం చేసిన విద్వాంసుడు. ఆయన ఒకచోట పద్యాన్ని పోతన్న లాగా నడిపించగలడు, ఒక చోట శ్రీనాథున్ని తలపిస్తాడు. ప్రాచీన కవుల పద్య శైలులను వంట బట్టించుకొని, తనదైన శైలిని చూపే ప్రజ్ఞావంతుడాయన. ఆయన రచించిన మహాకావ్యాలు ప్రబంధ కవుల కావ్యాలకు ఏమాత్రం తీసిపోవు.
రోజుకు కనీసం ఒక పద్యం..
వానమామలై వరదాచార్యులు ‘పోతన చరిత్ర’ను పద్యకావ్యంగా రచిస్తే, కిషన్ శర్మ గారు వరదాచార్యుల సాహిత్య జీవితాన్ని ‘వరదాభ్యుదయం’ పేరుతో కావ్యరచన చేసి అందరి మన్ననలను పొందినాడు. పోతన చరిత్రను వానమామలై రాస్తే, ఆ పోతన్ననే మళ్లీ జన్మించి ‘వరదాభ్యుదయం’ రాశాడా అనిపిస్తుంది. వరదాభ్యు దయానికి తెలంగాణా సారస్వత పరిషత్తు వారు నగదు బహుమతి ఇవ్వడం మెచ్చుకొనదగిన అంశం.
అంతేకాదు, ఉత్తమ పద్యకవిగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు కిషన్ శర్మను సన్మానించ డం గమనార్హం. కిషన్ శర్మ గారికి రామాయణం పట్ల గల ప్రత్యయాన్ని ‘సుందరకాండ’ తెలియజేస్తే, ‘శ్రీ దేవీ భాగవతం’ వారి అష్టాదశ పురాణ పరిజ్ఞానాన్ని అభివ్యక్తం చేస్తుంది. నిత్యం ఒక పద్యం రాయకుండా ఉండే వ్యక్తి కాడు కిషన్ శర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు పద్య పిపాసి, పద్యజీవనుడు. పెండ్యాల కిషన్‌శర్మ సాహిత్యంతో పరిచయం ఉన్నవాణ్ణి.
అంతేకాదు, ఆయన మంచి పౌరాణికుడు. తెలంగాణలో ఆయన భాగవతోపన్యాసాలు విననివారుండరు. విశేషమేమంటే, వారు భాగవతం మీద చేసిన ప్రసంగాలు కమనీయం, రమణీయం. వారు కాశీ, ద్వారక, హరిద్వార్, పూరి, అయోధ్య, ఉజ్జయినీ, బృందావనం, నైమిషారణ్యం మొదలైన సుప్రసిద్ధ క్షేత్రాల్లో భాగవత సప్తాహాలు నిర్వహించారు. దేశమంతా తిరిగి భాగవత సప్తాహాలు నిర్వహించిన ఘనత శర్మగారిదే. ఆధునిక కాలంలో మహాకావ్య నిర్మాణ దక్షుడు శర్మగారే. అలాంటి శర్మగారిని సాదాసీదా దుస్తుల్లో చూసి ఆనందాన్ని పట్టలేక రెండు చేతులు జోడించడమే గాక, ఆలింగనం చేసుకున్నంత పనిచేశాను.
శర్మగారు కూడా నా గురించి విన్నవారు కనుక ‘మీరు ఏడెనిమిది ఉపనిషత్ సప్తాహాలు నిర్విహించి నారు. నావేమో భాగవత సప్తాహాలు. ఇద్దరం ఇక్కడ కలుసుకోవడం పూర్వజన్మ సుకృతం’ అని ఎంతో ప్రేమతో మాట్లాడినారు. శర్మగారు భోజనం చేసినంత సేపు నా దగ్గరే ఉన్నారు. అంతసేపు ఇద్దరం పద్య పరిమళాలను పంచుకున్నాం. భోజనానంతరం ప్రయాణం వల్ల కల్గిన బడలి కను పోగొట్టుకోవడానికి, కొంచెం విశ్రాం తి తీసుకోవాలనుకున్నాను.
నా వాలకం గమనించిన శర్మగారు నన్ను తన ఇంటికి ఆహ్వానించినారు. వారి శ్రీమతి లలితగారు ‘బాబాయ్‌గారు రండి’ అని కూర్చున్న తర్వాత, విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిని చూపెట్టారు. నేనెంత సేపు నిద్రించా నో నాకే తెలియదు. ‘పుస్తకావిష్కరణ కార్యక్రమం భోజనానంతరం అన్నారు కదా! నేనేమో ఇక్కడ నిద్రపోయాను. నిర్వాహకులేమనుకుంటారో” అని సంశయించాను.
శర్మగారు ‘ఎవరేమీ అనుకోరు. ఇక్కడ ఉదయం, అనుకుంటే సాయంత్రం జరుగుతుంది కార్యక్రమం. ఈనాటి కార్యక్రమం ఉదయం కాకుండా, సాయంత్రానికి వాయిదా పడడం వల్ల, మీరు మా ఇంట్లో కాలు మోపారు. మా ఇల్లు పావనమైంది’ అంటూ తమ హర్షాన్ని వెలిబు చ్చారు. ఈ లోపల లలిత గారు వేడి వేడి కాఫీ తెచ్చి ఇచ్చారు. ఆ తరువాత, ‘ఇంక వెళ్దామా’ అన్నాను.
‘బాబాయ్‌గారు కూ ర్చోండి’ అంటూ లలిత గారు ఒక పళ్లెంలో నూతన వస్త్రాలు, పళ్లూ నాకు బహూకరించారు. చిత్రమేమంటే నాకు వారు సమ ర్పించిన నూతన వస్త్రాలతోపాటు మంచి వెల గల చీర కూడా ఉంది. ‘ఇదేమిటని నేను ఒంటరిని కదా! నా అర్ధాంగి ప్రమీల దివంగతురాలై ఆరేళ్లయింది’ అన్నాను. ‘ఇది మా సంప్రదాయం. ఆమె ఉన్నా లేకున్నా ఈ విధంగా ఆమెను సన్మానించుకోవడం మా పుణ్య విశేషం’ అంటూ శర్మ దంపతులు నన్ను సత్కరించారు.
అప్పుడు నిజంగా నా కళ్లు చెమ్మగిల్లాయి. కార్యక్రమంలో పాల్గొని శాలువా కప్పించు కోవడం కంటే ముందుగా, శర్మగారి ఇంట్లో నాకీ విధమైన సత్కారం లభించడం భాగ్య విశేషంగా భావించాను. శర్మగారూ నేనూ ఇద్దరం కలిసి సభాస్థలికి వెళ్లాం. శర్మగారు స్వాగత వచనాలతో నన్ను మంత్రముగ్ధుణ్ణి చేశారు. ఒకవిధంగా ఆనాటి కార్యక్రమాన్ని మరచిపో యాను గాని, శర్మ దంపతులు చూపిన అభిమానాన్ని ఈనాటికీ నా గుండెలో భద్రపరుచుకున్నాను.
నా సప్తతి మహోత్సవంలో శర్మగారు పాల్గొనడమేగాక, నాకు అంకితంగా ‘ముక్తాహారం’ అనే పద్య సంపుటిని అందించి, నా హృదయానికి మరింత చేరువయ్యారు. ఎవరైనా కలిసి ‘ఏమిటి? మీకూ శర్మగారికి గల సంబంధం’ అని అడిగితే ‘అది భాగవత సంబంధం, ఉపనిషత్సంబంధం’ అని సమాధానం ఇస్తుంటాను.