25-07-2025 12:05:00 AM
డాక్టర్ మంద అశోక్‌రెడ్డి :
భారతదేశం వ్యవసాయ ఆధారి త దేశం. దేశంలో ఎక్కువ కుటుంబాలు వ్యవసాయం ఆధారంగానే జీవిస్తాయి. దేశ ఆర్థికాభివృద్ధిలోనూ వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రైతులకు అనేక సంక్షేమ పథకాల ద్వారా సాయం అందిస్తున్నప్పటికీ, రైతులు సజావుగా సాగు చేసుకునేందుకు పెట్టుబడి సమకూర్చుకోలేకపోతున్నారు. అంత కష్టపడి సాగుచేస్తే వారికి కనీసం కూలి పైసల వంతైనా దక్కే ది గగనం.
వర్షాలు సరిగ్గా కురవకపోవ డం, లేదంటే అతివృష్టి రైతును అతలాకుతలం చేస్తాయి. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల బాధ యేటికేడు ఉంటుంది. అన్ని అవరోధాలు దాటి పండించిన పం టకు మార్కెట్‌లో గిట్టు బాటు ధర కూడా ఉండదు. ధర లేకపోతే పంటను నిల్వ చేసుకుందామంటే, సన్న, చిన్నకారు రైతులకు వెసలుబాటు లేదు. ఇలా రైతు తనకు తెలియకుండానే కష్టాల కడలిలో మునిగిపోతున్నాడు.
పంట కోసం అప్పు తెచ్చి, ఆ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వ బ్యాంకులు మొదలుకుని ఫైనాన్స్ కంపెనీల వరకు అన్నిచోట్ల అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్న కొందరు, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీటన్నింటినీ గుర్తించిన కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వం 2019 నుంచి రైతుల సం క్షేమం కోసం భూకమతం, విస్తీర్ణంతో సం బంధం లేకుండా ఆర్థిక సాయం అందించేందుకు 2019 నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు చేస్తున్నది.
ఎకరానికి ఏడాదికి రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. అయితే, 2019 జనవరి 31 వరకు భూమి పట్టాదారు పాస్ పుస్తకాలు న్న రైతులకు మాత్రమే ప్రస్తుతం ఆర్థిక సాయం అందుతున్నది. 2019 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వ్యవసాయ భూమి అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. వారసత్వంగా కొందరికి యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి.
కొత్త పట్టాదారులు అనుభవంలోకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం వారందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సాయం అందించా ల్సి ఉన్నది. కానీ, ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. పట్టాదారులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి నిలదీస్తే, వారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌లో కటాఫ్ డేట్ 2019 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉందని తేల్చి చెప్తున్నారు. మరి కొత్తగా పట్టాలు పొందిన వారికి ఎప్పుడు అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
తెలంగాణలో 6 లక్షల మంది..
తెలంగాణలో సాగులో ఉన్న 90శాతం భూమి చిన్న, సన్నకారు రైతులకు చెందినదే. వారిలో ఎక్కువలో ఎక్కువ భూమి కలిగి ఉన్నవారు ఐదు ఎకరాలలోపు వారు మాత్రమే. రాష్ట్ర సగటు భూ కమ తం 0.89 హెక్టార్లు మాత్రమే. అంటే అది దాదాపు రెండెకరాలకు సమానం. తెలంగాణలో ప్రస్తుతం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు 63 లక్షల మంది.
2020 గణాంకాల ప్రకారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అం దింది. ఆ సంఖ్య 2024 నాటికి సుమారు 31 లక్షలకు తగ్గింది. అంటే, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది రైతులకు సా యం అందడం లేదు. భూ యాజమాన్య హక్కుల బదిలీ, కొత్తగా పాసు పుస్తకాలు రావడంతోనే వారికి సాయం అందడం లేదు. కొత్త రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కటాఫ్ తేదీని పెంచుతుందని రైతులు ఆశిస్తున్నప్పటికీ, అది నిరాశగానే మిగిలిపోయింది.
2019లో పథకం ప్రారంభమైంది. పథకం కింద అర్హులైన రైతులకు పంట సాయం కింద సంవత్సరానికి ఎకరానికి రూ.6 వేల చొప్పున అందుతుంది. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఒకేసారి కాకుండా.. నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున జమ చేస్తుంది. ఆ సొమ్ము నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ అవుతాయి. ఇప్పటివరకు 17 విడతల్లో 2019 నుంచి పథకం వర్తిస్తున్న రైతులకు సుమారు రూ.40 వేలకుపైగా అందాయి.
మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ మొదటి సంతకం పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదల దస్త్రంపైనే చేయడం విశేషం. అయితే.. ఇదే సమయంలో కొత్తగా భూపట్టాలు పొంది న వారు, భూములు కొన్నవారికి ఎలాంటి వరం ప్రకటించకపోవడం విచారకరం. ఆరేళ్ల నుంచి కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే పొందేవారు ఇవి పాటించాల్సిందే..
రైతులు ఎలాంటి ఆటంకం లేకుండా పీఎం సమ్మాన్ నిధి లబ్ధి పొందాలంటే ప్రతి రైతు ఈ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇదే విషయాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది. ఈ- కేవైసీని మొత్తం 3 విధానాల్లో చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు. లేదా దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్లలో బయో మెట్రిక్ ద్వారా ఈ కేవైసీ చేసుకునే వీలు ఉంది.
లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా కూడా ఈ- కేవైసీ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డబ్బులు అందుకోవాలంటే.. సదరు లబ్ధిదారుడు.. కచ్చితంగా తమ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి. పీ ఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను పీఎం కిసాన్ అఫీషియల్ పోర్టల్‌లో చూడొచ్చు. దీని కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్ సందర్శించాలి.
వెబ్‌సైట్ ఓపెన్‌చేయగానే ఈ- కేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, నో యువ ర్ స్టేటస్, అప్డేట్ మొబైల్ నంబర్, వాలెంటరీ సరెండర్ ఆఫ్ పీఎం కిసాన్ బెనిఫిట్స్, బెనిఫీషియరీ లిస్ట్ ఇలా కనిపిస్తాయి. బెనిఫిషియరీ లిస్ట్‌పై క్లిక్ చేసి.. రాష్ర్టం, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఎంచుకోవాలి. తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేసి.. అక్కడ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
అనర్హులైన వారు.. పీఎం కిసాన్ బెనిఫిట్స్ పొందుతున్నట్లయితే వారు స్వచ్ఛందంగా సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యే రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ పధకాల అమలులో సౌలభ్యం కోసం విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీని కోసం రైతులు తమ వివరాల్ని స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతైనా కటాఫ్ తేదీని పెంచి కొత్త రైతులకు అవకాశం కల్పించాలి. ఈ యేడాది జనవరిలో పీఎం కిసాన్ సాయం పెంచుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, బడ్జెట్‌లో దీని కోసం తగినన్ని నిధులు కేటాయించలేదు.
మూడు దఫాల్లో ఇస్తే ఎలా?
కేంద్ర ప్రభుత్వం ఒక్క ఎకరానికి ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఇస్తున్నప్పటికీ, అదంతా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందతున్నది. ఇలా ఒక విడతలో రూ.2 వేల చొప్పున అందిస్తే అవసరాలు ఎలా తీరుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర సాయాన్ని ఏడాదికి కనీస రూ.12 వేల వరకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ మొత్తాన్ని రెండు విడతల్లో ఇవ్వాలని కోరుతున్నారు.
పెద్ద కార్పోరేట్ పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రాయితీలతో పోలిస్తే, తమకు చేసే సాయం చాలా తక్కు వ అని పేర్కొంటున్నారు. కరోనా సంక్షోభ సమయమైన 2020 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక, సేవా రంగాల్లో తక్కు వ వృద్ధిరేటు నమోదైంది. అప్పుడు, భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది కేవలం వ్యవసాయ రంగమేనని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ దేశ జనాభాలో సగం మంది ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడే ఉపాధి పొం దుతున్నారు.
భారత్‌లో పండించే పంటల వల్ల ఒక్క మనదేశ ప్రజలే కాకుండా, ఎగుమతుల ద్వారా అనేక దేశాల ప్రజలకు ఆహార కొరత తీరుతున్నది. ఇదంతా భారతదేశానికి చెందిన రైతుల కష్టంతోనే సాధ్యమవుతున్నది. కాబట్టి, కేంద్ర ప్రభు త్వం వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. ఎకరానికి రైతులకు అందించే సొమ్ము పరిమితి పెంచాలి. 2019లో కొత్త గా పట్టాలు పొందిన వారికి పథకం వర్తింపజేయాలి.