2 April, 2026 | 11:59 AM

రోగులకు మెరుగైన వైద్యం అందించండి

17-06-2025 01:15 AM
  1. కొవిడ్‌పై ప్రజలను అప్రమత్తం చేయండి
  2. ఖాళీగా ఉన్న పోస్టులను సత్వరం భర్తీ చేయండి
  3. గాంధీ దవాఖాన సందర్శనలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలను మళ్లీ అప్రమత్తం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. దవాఖానలోని పలు విభాగాల్లో కలియదిరుగుతూ రోగులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు.

ఖాళీగా ఉన్న పోస్టులు, వైద్యుల కొరతపై మెడికల్ అధికారులను ప్రశ్నించారు. దవాఖానకు రోగుల తాకిడి పెరుగుతున్నందున వైద్యసేవలను విస్తృత పరచాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. దవాఖానలో కొత్త విభాగాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సత్వరం ఆర్‌ఎంవో పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా గాంధీ దవాఖానలోనే కాక, ఇతర దవాఖానల్లోనూ రోగులు వైద్యం చేయించుకునే అవకాశం కలుగుతుందన్నారు. కొవిడ్ సమయంలో దవాఖానలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, అవి ఇప్పటికీ పనిచేస్తుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థను  మరింతగా మెరుగుపరచాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన అనారోగ్య పీడుతులను పూర్తి ఆరోగ్యవంతులను చేసి బయటకు పంపించాలని సూచించారు.