అస్పృశ్యత నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
28-02-2026 09:17 PM
సిద్దిపేట క్రైం: రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని, సమాజంలో అస్పృశ్యత నివారణకు కృషి చేయాలని సిద్దిపేట టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా పరిధిలోని మందపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ హాజరై మాట్లాడారు. గ్రామంలో కుల వివక్షకు తావు లేకుండా, అందరూ సోదరభావంతో మెలగాలని సూచించారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల నేరాలను అదుపు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భవాని, జీపీవో వి.కరుణాకర్, ఉప సర్పంచ్ బర్రె కిష్టయ్య, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




