1 March, 2026 | 3:14 AM

కోళ్ల ఫామ్ వల్ల ఈగల బెడద

28-02-2026 09:21 PM

యాజమాన్యానికి నోటీసులు

 జారీ చేసిన సర్పంచ్‌లు

నవాబ్ పేట్: మండల పరిధిలోని ఇప్పటూర్ గ్రామ సమీపంలోని ఒక కోళ్ల ఫామ్ కారణంగా పరిసర గ్రామాల్లో ఈగల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన ఇప్పటూర్ సర్పంచ్ రవి కిరణ్, చెన్నారెడ్డి పల్లి సర్పంచ్ నవనీత గ్రామ కార్యదర్శులతో కలిసి సదరు కోళ్ల ఫామ్ యాజమాన్యానికి శుక్రవారం నోటీసులు అందజేశారు. కోళ్ల ఫామ్ నిర్వహణలో లోపాల వల్ల ఈగలు భారీగా పెరిగి ఇళ్లలోకి వస్తున్నాయి.

దీనివల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం తక్షణమే స్పందించి శాస్త్రీయ పద్ధతుల్లో ఈగల నివారణకు చర్యలు చేపట్టాలని వారు కోరారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోళ్ల ఫామ్ ప్రతినిధి కేశవులు నోటీసులను స్వీకరించి, ప్రభావితమైన మూడు గ్రామాల్లో ఈగల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లతో పాటు తోట రాములు, రైతులు మైబు, రవి మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.