ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు: కలెక్టర్ రవి నాయక్
మహబూబ్నగర్: ప్రజలు తమ సమస్యలతో సతమతమవుతూ జిల్లా అధికారులను కలిసిన సమయంలో సవిధానంగా వారి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గుగులోతు రవి నాయక్ అన్నారు. సోమవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయం నందు ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వారి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి ద్వారా ప్రజలు అందించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రజావాణికి వస్తే కాకుండా అధికారులకు ఆయా గ్రామాలలో పట్టణ కేంద్రాలలో వారి దృష్టికి వచ్చినా ? చూసినా ? అట్టి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కావాలని నిర్లక్ష్యం చేసినట్లు రుజువైతే సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజల నుండి రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ,ఎస్.సి.అభివృద్ది శాఖ,ఇతర శాఖల కు సంబంధించిన దరఖాస్తులు అందచేశారు. కలెక్టర్ మాట్లాడుతూ... ధరణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్ లను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ప్రతి రోజు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పెండింగ్ దరఖాస్తుల పురోగతి సమీక్షిస్తారని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావు, డి.అర్. ఓ .కె.వి.వి.రవి కుమార్,జడ్.పి.సి. ఈ. ఓ రాఘవేంద్ర రావు,డి.అర్.డి. ఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.






