13 May, 2026 | 11:22 AM

ప్రభుత్వ స్కూళ్లు, దవాఖానలకు ప్రజలే ఓనర్లు

21-06-2024 01:59 AM

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ దోహదం

నులిపురుగు నివారణకు అందరూ సహకరించాలి

మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులకు ప్రజలే ఓనర్లని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.  ప్రజా సంక్షేమం, విద్య, వైద్యానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పంపిణీ చేశారు.

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ టాబ్లెట్ వేయించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.   రాష్ర్టవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ టాబ్లెట్లను అన్ని ప్రభుత్వ పాఠశాలలు,  కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో  19 ఏళ్ల లోపు వారందరికీ ఉచితంగా అందిస్తారని తెలిపారు. గురువారం నుండి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగాను తమ దినచర్యలో భాగం  చేసుకోవాలని సూచించారు.  

పిల్లల ఎదుగుదలకు డీవార్మింగ్ మందులు తప్పనిసరి : మంత్రి పొన్నం 

పిల్లల శారీరక ఎదుగుదలకు డీ వార్మింగ్ మందులు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తల్లితండ్రులు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చిన్నారులంతా ఈ మాత్రలు వేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఆరోగ్య తెలంగాణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.    కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్ భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, కలెక్టర్ అనుదిప్ దురశెట్టి, స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి, వైద్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.