13 May, 2026 | 11:58 AM

Breaking News

పిన్నెల్లి బెయిల్‌పై తీర్పు రిజర్వ్

21-06-2024 01:56 AM

విజయవాడ, జూన్ 21 (విజయక్రాంతి): పోలీసులు పెట్టిన మూడు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు గురువారం ప్రకటించారు. ఈవీఎం ధ్వంసంతో పాటు రెండు హత్యాయత్నం కేసుల్లో గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వొకేట్ నిరంజన్‌రెడ్డి తప్పుపట్టారు. పోలీసులు పరిధిదాటి వ్యవహరించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసీ తీరు ఉందన్నారు.

పోలీసుల లాయర్ అశ్వనీకుమార్ ప్రతివాదన చేస్తూ ఈవీఎం ధ్వంసం ఘటన తీవ్రమైనదని చెప్పారు. హత్యాయత్నం కేసుల్లో ఉపశమనం కల్పిం చవద్దని కోరారు. బెయిల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం చేసేందుకు మాత్రమే రూల్స్ ఉన్నాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.