21 August, 2026 | 12:04 AM

ఆర్‌ఓబీకి మోక్షమేది?

21-08-2026 12:00 AM
  1. చటాన్‌పల్లి రైల్వే గేటు వద్ద ప్రజల తిప్పలు
  2. పెరిగిన అంచనా వ్యయం రూ. 95కోట్ల నుంచి రూ.184 కోట్లు 
  3. ప్రకటనలకే పరిమితమైన ప్రజాప్రతినిధులు, అధికారులు 
  4. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

షాద్‌నగర్, ఆగస్టు 20 (విజయక్రాంతి): ఓవైపు అధికారులు మారిన డిజైన్లు, పెరిగిన బడ్జెట్ గణాంకాలు చూపిస్తుంటే.. మరోవైపు నిత్యం ఆ మార్గంలో వెళ్లే వేలాది మంది ప్రజలకు మాత్రం నరకం కనిపిస్తోంది. ఐదేళ్లుగా హామీల వర్షం కురుస్తున్నా, చటాన్పల్లి ఆర్‌ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంలో అడుగడుగునా జాప్యం జరగడంతో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.

రైలు వస్తే గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు ప్రతి నిత్యం.....సగటు మనిషి సమయం వృథా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి, బుచ్చిగూడ, దూసకల్, వెల్జర్ల, సంగెం, కొత్తపేట తదితర గ్రామాల ప్రజలకు ఈ మార్గమే ప్రధాన ఆధారం. రోజుకు వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై రైలు వస్తోందంటే చాలు గేటు పడిపోతుంది.ట్రాఫిక్ జామ్: ఒక్కసారి గేటు పడితే రెండు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.

నరకయాతన..

ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు సమయానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసరం ఉన్నా తప్పని ఆగచాట్లు: ఆస్పత్రులకు వెళ్లే అంబులెన్సులు, అత్యవసర సేవల వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.

రూ.95 కోట్ల నుంచి రూ.184 కోట్లకు..

అంచనాలు పెరిగినా కష్టాలు తీరలేదు.

2021లో మొదటిసారి రూ.95 కోట్లతో ఆర్‌ఓబీకి శ్రీకారం చుట్టారు. కానీ ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకుసాగకపోగా, రీ-డిజైనింగ్ పేరుతో 2025 మే నాటికి ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ.184 కోట్లకు చేరింది. బ్రిడ్జిని ’వై’  ఆకారంలో నిర్మించి ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని నేతలు హామీలిచ్చినా, ఇప్పటికీ పనుల్లో పురోగతి లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మా ఇబ్బందులకు మోక్షమెప్పుడు? 

ఇటీవల రైల్వే (ఐ ఓ బీ ), మున్సిపల్, ఆర్‌అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినప్పటికీ ప్రజల ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు.

భూసేకరణ ఎంతవరకు వచ్చింది?

కొత్త డిజైన్కు అన్ని రకాల అనుమతులు లభించాయా?...నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయి?.. అనే ప్రశ్నలు క్షేత్రస్థాయిలో... నిత్యం ప్రజల నుంచి  వినిపిస్తున్నా యి. ఇప్పటి కైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలకే పరిమితం కాకుండా, తక్షణమే చటాన్పల్లి ఆర్‌ఓబీ నిర్మాణాన్ని పూర్తి చేసి తమ నిత్య నరకయాతన నుంచి విముక్తి కల్పించాలని స్థానిక ప్రజలు  డిమాండ్ చేస్తున్నారు.