నీటి కుంటలకు ప్రాధాన్యం!
- పంటల రక్షణకు రైతన్నల ఆసక్తి
- ఎల్నినో నేపథ్యంలో ఏర్పాటుకు ముందంజ
మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల్లో ఎండుతున్న పంటలను సంరక్షించుకోవడానికి పంట, నీటి కుంటల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో ఉద్యాన శాఖ, ఉపాధి హామీ పథకంలో (Horticulture Department, under the Employment Guarantee Scheme) పంట, నీటి కుంటల ఏర్పాటుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాలో లోటు వర్షపాతం కారణంగా సాగులో ఉన్న వాణిజ్య పంటలతో పాటు, ఇతర ఆరుతడి పంటలకు సాగునీరు అందించడానికి పంట, నీటి కుంటలు ఇప్పుడు ఎంతో దోహదపడతాయని రైతులు భావిస్తున్నారు.
సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో ఉద్యాన, ఆయిల్ పామ్, మల్బరీ, కూరగాయలు, పూలు, మునగ, ఉల్లి, మొదలైన మార్కెట్ డిమాండ్ పంటలు సాగు చేస్తున్న రైతులకు నీటి సంరక్షణ పద్ధతులు అనుసరిస్తున్నారు. పంట, నీటి కుంటలతో పాటు, కూరగాయ పందిళ్లు, ట్రెల్లిస్ పద్ధతి, మల్చింగ్ ఎత్తు మడులు, బిందు సేద్యం, ఫర్టిగేషన్, సేంద్రీయ పద్ధతులు, నేచురల్ ఫార్మింగ్ పాటిస్తున్నారు.
అప్పుడప్పుడు కురుస్తున్న వర్షపు నీటిని సంరక్షించి, వర్షపు నీటినీ సేకరించి కరవు సమయాల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు వర్షపు నీటిని వృథా చేయకుండా సేకరించి, ట్యాంకుల్లో లేదా భూమిలో నిల్వ చేస్తున్నారు. కూరగాయలు, ఆయిల్ పామ్ ,పండ్ల తోటలు, మల్బరీ పూలు, మునగ, మొదలైనవి సాగు చేసినప్పుడు పూత, పిందె దశలలో (క్రిటికల్ స్టేజెస్) పంట, నీటి కుంటల్లో నిల్వచేసిన నీటిని తడి ఇచ్చి, పంటను కాపాడుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ఇటీవల నీటి కుంటల నిర్మాణం ముమ్మరంగా చేపట్టారు.
* నీటి కుంటల పథకాలు 5 ఎకరాల లోపు విస్తీర్ణం కలిగిన రైతులు వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్ గార్, అజివికా మిషన్ గ్రామీణ్ పథకం ద్వారా రెండు సైజుల లో నీటి, పంట కుంటలు ఏర్పాటు చేసుకోవచ్చు.
* మోడల్ 01: కొలతలు: 40 అడుగుల పొడవు,40 అడుగుల వెడల్పు, 6.5 అడుగుల లోతు (12 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు) అంచనా వ్యయం: రూ.80 వేలు పని దినాల సంఖ్య: 400
* మోడల్ 02: కొలతలు: 65 అడుగుల పొడవు 65 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతు (20 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు 3 మీటర్ల లోతు) అంచనా వ్యయం 4 లక్షల రూపాయలు, పని దినాల సంఖ్య : 1100 అర్హత: 5 ఎకరాల లోపు సన్న, చిన్నకారు రైతులు.
* కావలిసిన పత్రాలు: పట్టదార్ పాస్ బుక్ జాబ్ కార్డ్, ఆయిల్ పామ్ పథకం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ - ఆయిల్ పామ్ పథకంలో ఆయిల్ పామ్ రైతులకు - కొలతలు: 65 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు 10 అడుగుల లోతు (20 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు 3 మీటర్ల లోతు) జియో మెంబ్రేన్ షీట్
అంచనా వ్యయం: రూ.4 లక్షలు రాయితీ:.90 వేల రూపాయలు. కనుక రైతులు శాశ్వత ఆదాయం కోసం నీటి కుంటలు (పంట కుంటలు) ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయోజనం అందిస్తోంది.
రైతులు నీటి కుంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి
కరువు నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి పంట, నీటి కుంటలు ఎంతో మేలు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో నీటి కుంటల వినియోగం అవసరం. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్న నేపథ్యంలో నీటి కుంటల ప్రాధాన్యత మరింత పెరగాలి. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వినియోగించుకొని నీటి కుంటల నిర్మాణాన్ని చేపట్టాలి. నీటి కుంటల నిర్మాణానికి ముందుకు వచ్చే రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందజేస్తాం.
జే. మరియన్న, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, మహబూబాబాద్






