calender_icon.png 6 February, 2026 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పులిగుండు’కు.. క్వారీ ముప్పు

06-02-2026 01:54:19 AM

  1. క్రీ. పూ.4000 ఏండ్లనాటి కొత్తరాతియుగపు ఆనవాళ్లకు పొంచి ఉన్న ప్రమాదం
  2. పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ శివనాగిరెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) :  నారాయణపేట జిల్లా దేవరకద్ర మండలం బస్వాయపల్లి శివారులోని ‘పులిగుండు’ గుహకు పక్కనే కొనసాగుతున్న క్వారీ పనులతో ప్రమాదం పొంచి ఉందని ఆర్కియాలజిస్టులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.  క్రీ.పూ. 4000 ఏండ్లనాటి కొత్తరాతియుగపు (చరిత్రకు పూర్వయుగం) ఆనవాళ్లను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు.

క్రీ.పూ. 4 వేల ఏండ్ల క్రిత నాటి గుహాలయాలు..

బస్వాయపల్లి శివారులో ఉన్న ‘పులిగుండు’గా పిలిచే అరుదైన గుహ చరిత్రకు పూర్వయుగం నాటిదని (క్రీ.పూ.4000), దీనిని సంరక్షించాల్సిన అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించాలని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఇ.శివనాగిరెడ్డి కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించి క్రీ.పూ.4 వేల కిందటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను ఆయన వివరించారు. వీటిని ‘వారసత్వాన్ని భావి తరాల కోసం కాపాడుకుందాం’ అనే కార్యక్రమంలో భాగంగా సందర్శించిన డాక్టర్ శివనాగిరెడ్డి పలు కీలకమైన అంశాలను వెల్లడించారు.

తెరిచిన పులి నోరు ఆకారంలో..

ఈ చరిత్రకు పూర్వయుగం నాటి ఆనవాళ్లలో తెరిచిన పులి నోరు లాంటి రాతి గుండును ఆయన వివరించారు. క్రీ.పూ. 4 వేల ఏండ్ల క్రితం తెరిచిన పులి నోరు ఆకారంలో ఉన్న ఈ రాతిగుండు గుహను నవీన శిలాయుగపు మానవుల కు తాత్కాలిక నివాసంగా ఏర్పర్చుకుని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆధారాలను బట్టి ఈ ప్రాంతం క్రీ.పూ.4000 ఏండ్ల క్రితం ఉంటుందని ఆయన నిర్ధారించారు. 

రాతిపై జంతువుల శిలా చిత్రాలు

అంతే కాకుండా, ఈ పులిగుండు పక్కనే ఉన్న మరో దుర్భేద్యమైన రాతిపై ఎద్దులు, ఇతర జంతువుల శిలా చిత్రాల గుర్తులు (రాక్ బ్రూయిజింగ్స్)ను ఆయన కనుగొన్నారు. ఈ అపురూప చారిత్రక సంపద పులిగుండు పక్కనే ఏర్పాటు చేసిన విశాలమైన క్వారీతో నిరంతరం రాతి తవ్వకాలలతో, ప్రకృతి విధ్వంసం నుంచి చారిత్రక ఆనవాళ్లకు ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆనవాళ్లను కాపాడి భావి తరాలకు అందించాలని స్థానిక క్వారీ యజమానులకు, ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.