13 May, 2026 | 2:52 AM

ముందుకు సాగని కొనుగోళ్లు

13-05-2026 01:42 AM
  1. మక్క రైతులకు తొలగని కష్టాలు
  2. కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు

మహబూబాబాద్, మే 12 (విజయక్రాంతి): మక్కల కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర పొందడానికి రెట్టింపు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కర్షకులు వాపోతున్నారు. పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగనీయొద్దని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు మాత్రం తొలగడం లేదు. ప్రైవేటు ట్రేడర్లు మక్కలకు క్వింటాలుకు గరిష్టంగా 1800 రూపాయలకు మించి పెట్టడం లేదని, ప్రభుత్వం మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా మక్కలకు క్వింటాలకు 2,400 రూపాయల ధరతో కొనుగోలు చేస్తుండడంతో మక్కలు పండించిన రైతులంతా మార్క్ఫెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ సంస్థ కొనుగోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో యాసంగి సీజన్‌లో మొక్కజొన్న పంట సాగు చేయగా, ఎకరానికి కనిష్టంగా 30, గరిష్టంగా 40 క్వింటాలకు పైగా మొక్కజొన్న పంట దిగుబడి ఇచ్చింది. నెల రోజులుగా పంట కోతలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మక్కల అమ్మకాలకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. 

విక్రయానికి పాట్లు

2025 యాసంగి సీజన్లో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు ముందుగా కొనుగోలు కేంద్రం, ఏఈవో వద్దకు వెళ్లి తాను పండించిన పంట ఉత్పత్తి శాంపిల్ చూపించి 14 శాతం లోపు తేమ, నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉంటే , పంట సాగు నమోదు ఆధారంగా ఎంత పంట ఉత్పత్తి విక్రయించుకోవడానికి అనుమతి ఉందో టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంట దిగుబడి కి అవసరమైన గన్ని బస్తాలను 27 రూపాయల చొప్పున ఖరీదు చేసి, బస్తాకు 30 రూపాయల వరకు హమాలీ కూలీ చార్జీలు చెల్లించి, 51 కిలోల చొప్పున భర్తీ తూకం వేయించి, 1500 రూపాయలు రోజుకు ట్రాక్టర్ కిరాయి చెల్లించి వే బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చి 100 చెల్లించి, వే బ్రిడ్జి కాంటా వేసిన తర్వాత మార్క్ ఫెడ్ దిగుమతి స్టాక్ పాయింట్ వద్దకు తేవాల్సి ఉంటుంది.

ఇక్కడ సీరియల్ ప్రకారం ట్రాక్టర్ లో తెచ్చిన మక్కలను దిగుమతి చేయడానికి బస్తాకు రెండు రూపాయలు చొప్పున చెల్లించి దిగుమతి చేసిన తర్వాత మళ్లీ ఖాళీ ట్రాక్టర్ ను వేబిడ్జి వద్దకు తీసుకువెళ్లి మళ్లీ తూకం వేయించి, ఆ రసీదు తీసుకువచ్చి దిగుమతి చేసుకున్న ఇన్చార్జ్ కు అప్పగించి ట్రక్ షీట్ పొందితే కొనుగోలు పూర్తయినట్లు. ఈ తతంగం అంతా పూర్తి కావడానికి కనీసం రెండు రోజులు సమయం పడుతోందని రైతులు చెబుతున్నారు.

దీనివల్ల అదనంగా తమకు రోజుకు 1500 రూపాయలు ట్రాక్టర్ కిరాయి భారం మోయాల్సి వస్తుందని, మద్దతు కోసం వెళ్తే ఇన్ని రకాల సమస్యలతో సతమత అవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మొదలు పెడితే దిగుమతి స్టాక్ పాయింట్ వరకు విపరీతమైన రద్దీ, క్యూలైన్ లో వేచి ఉండాల్సి వస్తుండడంతో నిద్రాహారాలు మాని మక్కలు విక్రయించుకోవడానికి నానా యాతన పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రోజుకో తీరుగా ఇబ్బంది పెడుతున్నారు భూక్యా రాంధన్, రైతు, వెంకటగిరి

మొన్నటి వరకు కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలు కొంటామన్నారు. అక్కడికి తెచ్చుకుని మక్కలను పోసుకున్నాం. నిన్న మొన్నటి నుండి మీరే కాంటా పెట్టుకొని ట్రాక్టర్ల ద్వారా కేసముద్రం మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన దిగుమతి కేంద్రానికి తెచ్చుకోమన్నారు. దీనితో ముందుగా వేలిముద్ర వేసి ఎన్ని బస్తాలు కొంటారో తెలుసుకుని, ఆ విధంగా పంటను వ్యవసాయ శాఖ అధికారికి చూపెట్టి, ఆయన అనుమతి మేరకు బస్తాల్లో నింపి కాంట పెట్టి, టాక్టర్ కిరాయి తీసుకొని వేబ్రిడ్జి కాంటా వేయించి, మార్కెట్లో దిగుమతి చేయడానికి రెండు రోజులు పట్టింది. టాక్టర్ కిరాయి 3000, ఇతర ఖర్చులు, ఇన్ని రోజుల నిరీక్షణ, మక్కలు పండిస్తే ఇంత గోస పడాల్సి వస్తోంది. రోజుకో తీరుగా చెప్పి మమ్ములను ఇబ్బంది పాలు చేస్తున్నారు.