ఎన్డీడీబీకి చేతికి ‘మదర్ డెయిరీ’
- నష్టాలు, అప్పులు, బకాయిలను తీర్చడానికి ఒప్పందం చేసుకున్న ‘నార్ముల్’ పాలకవర్గం
- ఒప్పందంపై మంత్రి సమక్షంలో ఒప్పందం పూర్తి
ఎల్బీనగర్, మే 12 (విజయక్రాంతి): నష్టాల్లో నడుస్తున్న నల్లగొండ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) డెయిరీకి ఆసరా దొరికింది. ఎన్డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు)తో ఒప్పందం ప్రక్రియ మంగళవారం మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో పూర్తయింది. ప్రభుత్వం తరపున పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సెక్రటరీ ఇలంబర్తి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, నార్ముల్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తదితరులు హాజరై ఎన్డీడీబీ ప్రతినిధులతో ప్రక్రియను పూర్తి చేశారు.
ఆ వెంటనే పాడిరైతుల పాలబిల్లుల చెల్లింపుల కోసం రూ. 10 కోట్లను నార్ముల్ అకౌంట్‌కు బదిలీ చేస్తూ సంబంధిత చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నార్ముల్ మదర్ డెయిరీ ఎండీ లింగారెడ్డి, మదర్ డెయిరీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో త్వరలోనే పూర్వ వైభవం తీసుకు వస్తామని నార్ముల్ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
మదర్ డెయిరీకి పూర్వ వైభవం వచ్చేనా?..
సహకార సమాఖ్యకు స్ఫూర్తినిచ్చిన ఉమ్మడి నల్గొండ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్ దశాబ్ద కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. అవినీతి, పాలకవర్గాల ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా మారడంతో మదర్ డెయిరీ నష్టాలు, అప్పుల ఊబీలోకి కూరుకుపోయింది. రైతులకు బిల్లులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్థితికి నార్ముల్ సంస్థ చేరుకున్నది. బిల్లుల కోసం రైతులు, వేతనాల కోసం ఉద్యోగులు, సిబ్బంది అనేకసార్లు ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పుల బాధల నుంచి గట్టెక్కించేందుకు మదర్ డెయిరీని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్‌బోర్డు (ఎన్టీడీబీ)కి అప్పగించారు.
గతం ఘనం.. వర్తమానం దీనం..
నార్ముల్ (నల్గొండ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్) దాదాపు 40 ఏండ్లుగా పాడి రైతులకు ఆసరాగా నిలుస్తున్నది. దీని పరిధిలో సుమారు 32 వేల మంది పాడిరైతులు, 432 సొసైటీలు, 42 చిల్లింగ్ కేంద్రాలున్నాయి. సంస్థలో దాదాపు 500 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో 72 ఎకరాల విస్తీర్ణంలో మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయం ఉన్నది. నార్ముల్ పదేండ్ల కింద డెయిరీ లాభాల్లోనే నడిచింది. కరోనా సమయంలో రూ.16 కోట్ల అప్పులయ్యాయి. 2023 వరకు రూ.16 కోట్ల అప్పులు ఉండగా, ప్రస్తుతం రూ. 70 కోట్లకు చేరాయి. దీంతో మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకుపోయింది. దీనిని కాపాడడానికి నార్మల్ సంస్థకు చెందిన భూములను విక్రయించాలని గతంలో తీర్మానాలు చేశారు.
బిల్లులు రాక రైతుల ఆందోళనలు..
’నార్ముల్’ దాదాపు 40 ఏండ్లుగా పాడి రైతులకు ఆసరాగా నిలుస్తున్నది. దీనిపరిధిలో సుమారు 32 వేల మంది పాడి రైతులు, 432 సొసైటీలున్నాయి. సంస్థలో దాదాపు 500 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు 8 పాల బిల్లులు రాలేదు. దీంతో రైతులు మదర్‌డెయిరీకి పాలు పోయడం భారీగా తగ్గించారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. వేతనాల సకాలంలో అందకపోవడంతో గతంలో కొందరు వర్కర్లు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి.






