రేపటితో ముగియనున్న కొనుగోళ్లు
- కరీంనగర్ జిల్లాలో 96 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి
- 236 కొనుగోలు కేంద్రాలు మూసివేత
కరీంనగర్, జూన్ 4(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలోని 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియ 96% పూర్తయింది. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి రాగా 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి రైతులకు రూ.628 కోట్లు చెల్లింపు పూర్తయింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవడంతో 236 కేంద్రాలను అధికారులు మూసివేశారు,
ఈనెల 6వ తేదీలోగా మిగిలిన 81 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. మొత్తంగా మరో మూడు రోజుల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నరు. హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో, మానకొండూర్ నియోజకవర్గంలోని మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నూరు శాతం పూర్తి కావడంతో అన్ని కొనుగోలు కేంద్రాలను మూసి వేశారు.
చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది. కొనుగోలు చేసిన ధాన్యం నుండి 3,16,926 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం 13,139 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది, ఈ ప్రక్రియ మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. జిల్లా కలెక్టర్ చిత్ర మిత్ర క్షేత్ర స్థాయిలో పర్యటించి కొనుగోలు వేగవంతం చేయడం తో మిగితా జిల్లాల కంటే కరీంనగర్ జిల్లా టాప్ లో నిలిచింది.






