సెక్షన్ల వారీగా ప్రక్షాళన!
- వాణిజ్య పన్నుల శాఖలో భారీగా ప్రమోషన్లు, బదిలీలు
- కొత్తగా 624 మందిని కేటాయించిన సర్కారు
- అవినీతి ఆరోపణలున్న వారిపై బదిలీ వేటు!
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఇటీవల కాలంలో వివా దాలకు కేంద్ర బిందువుగా మారిన వాణిజ్య పన్నుల శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తున్నది. గ్రూప్-4 నియామకాలతో డిపార్ట్‌మెంట్‌లో భారీగా బది లీలు చేయనుండగా పదోన్నతులూ ఇవ్వనున్నారు. ట్రాన్స్‌ఫర్స్ విషయం పై ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు, స్పెషల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం.
రూ.1,400 కోట్ల స్కామ్, ఏసీబీకి వరుసగా అధికారులు పట్టబడటం, ప్రధాన కార్యాలయంలో కొందరు అధికారులు, సిబ్బంది తీరుపై అవినీతి ఆరోపణలు.. ఇలాంటి వారిపై కొరడా ఝులిపేందుకు యంత్రాంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. హెడ్ ఆఫీస్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఒకేసారి కాకుండా.. సెక్షన్ల వారీగా ప్రక్షాళన చేసే దిశగా ఉన్నతాధికారులు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
కొత్తగా 624 మంది..
ప్రభుత్వం ఇటీవల గ్రూప్-4 ద్వారా 8,084 మంది ఉద్యోగులను ఎంపిక చేసింది. వీరిలో 624 మంది జూనియర్ అసిస్టెంట్స్‌ను వాణిజ్య పన్నుల శాఖకు కేటాయించింది. వీరికి పోస్టింగ్ ఇవ్వాలంటే.. ప్రస్తుతం ఉన్న వారికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయాలి. ఇదే సమయంలో సీనియర్ అసిస్టెంట్లు ఏసీటీవోలుగా ప్రమోషన్ పొందుతా రు.
ఈక్రమంలో పోస్టింగ్‌ను బట్టి కొందరికి బదిలీలు కూడా ఉంటాయి. కొందరు సిబ్బంది, అధికారులు ప్రమోషన్స్ తీసుకుంటున్నారు కాని, బదిలీకి ఇష్టపడటం లేదు. ఇలాగే కొనసాగితే డిపార్ట్‌మెంట్‌పై మరింత మరక పడుతుందని భావించిన అధికారులు ప్రక్షాళనకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సర్కిళ్లకు పంపే యోచనలో..
ప్రధాన కార్యాలయంతోపాటు డివిజన్లలో కొందరు ఉద్యోగులు, సిబ్బంది చాలా ఏళ్లుగా తిష్ట వేసినట్లు తెలుస్తోంది. ఏకంగా ఓ అధికారి 20ఏళ్లుగా హెడ్ ఆఫీస్‌లో పనిచేస్తున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి..
దీంతో ఎక్కువ కాలంగా ఒకే దగ్గర పనిచేస్తున్న, అవినీతి ఆరోపణలు ఉన్న ఉద్యోగులు, సిబ్బందిని సర్కిళ్లకు పంపే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రధాన కార్యాలయంలోని కొందరు ప్రైవేటు ఉద్యోగులను కూడా సర్కిళ్లకు పంపే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.




