చిగురించిన రైతన్నల ఆశలు.. వాడిపోతున్న పంటలకు ప్రాణం
రామారెడ్డి,ఆగస్టు 1(విజయక్రాంతి): గత మూడు నాలుగు రోజులుగా కామారెడ్డి జిల్లా(Kamareddy District) వ్యాప్తంగా కురుస్తున్న విస్తారమైన వర్షాలు రైతన్నల్లో కొత్త ఆశలను చిగురింపజేశాయి. ఇటీవల వర్షాభావంతో ఎండుముఖం పట్టిన వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోశాయి. పొలాలు తడిసి ముద్దవడంతో పంటలు మళ్లీ కోలుకుంటుండగా, అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.ఈ ఖరీఫ్ సీజన్‌లో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇప్పటికే సాగు కోసం పెట్టిన పెట్టుబడి వృథా అవుతుందేమోనని ఆవేదన చెందారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు పరిస్థితిని పూర్తిగా మార్చివేశాయి. నేలలో తేమ పెరగడంతో పంటలు తిరిగి చిగురిస్తూ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు క్రమంగా నీటితో నిండుతుండటంతో భూగర్భ జలమట్టం కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సాగునీటి సమస్య కొంతవరకు తీరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో మరో కొద్ది రోజులు మోస్తరు వర్షాలు కురిస్తే పంటల దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రకృతి ఇలాగే సహకరిస్తే ఈ ఖరీఫ్ సీజన్‌లో మంచి దిగుబడులు సాధించి, రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని అన్నదాతలు ఆశతో ఎదురుచూస్తున్నారు.






