వేసవి దుక్కులతో నాణ్యమైన పంట దిగుబడి సాధ్యం
వ్యవసాయ విస్తరణ అధికారి ముఖ్యం తిరుపతి..
మందమర్రి (విజయక్రాంతి): రైతులు తమ పంట పొలాల్లో వేసవి దుక్కులు చేయడం ద్వారా నేల గుల్ల బారి నాణ్యమైన పంట దిగుబడి సాధ్యమవుతుందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి(Mandal Agricultural Extension Officer Mutyam Tirupati) అన్నారు. మండలంలోని పొన్నారం గ్రామంలో వేసవి దుక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వేసవి దుక్కుల వలన భూమి గుల్లబారి పంట వేర్లు ఎక్కువగా విస్తరించి బలమైన పంట ఏర్పడుతుందని తద్వారా నాణ్యమైన పంట దిగుబడి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వేసవి దుక్కులతో తొలకరి వర్షాలకు ఎక్కువ నీటిని పట్టి ఉంచుకొని ఎక్కువ రోజులు తేమను పంటకు అందిస్తుందన్నారు.
అదేవిధంగా వేసవి దుక్కులు లోతుగా చేసుకోవడం ద్వారా భూమి లోపలి పొరల్లో ఉన్న వివిధ శత్రు పురుగుల ప్యూప దశలు నశించి కీటక సంహరణ జరుగుతుందన్నారు. వివిధ శిలీంద్ర బీజాల నివారణ జరిగి తదుపరి పంటకు భూమి ద్వారా ఆశించు చీడపీడల నివారణ జరుగుతుందని అన్నారు. అంతే కాకుండా వివిధ రకాలైన కలుపు మొక్కల విత్తనాలు ఎండవేడికి నశించి కలుపు నివారణ జరుగుతుందని వేసవి దుక్కుల ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సయిండ్ల కనకరాజు, పంచాయతీ కార్యదర్శి హరీష్,కాంగ్రెస్ నాయకులు పెంచాల రాజలింగు, గ్రామ రైతులు పాల్గొన్నారు.






