రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల తీరును పరిశీలించారు.తనిఖీలో భాగంగా ఉద్యోగుల హాజరు రిజిస్టర్, మెయింటెనెన్స్ రిజిస్టర్‌లను పరిశీలించిన కలెక్టర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌పేషెంట్ అడ్మిట్ కార్డులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని సూచించారు.అనంతరం ఆసుపత్రి ఎదుట ఉన్న మురికి కాలువను మున్సిపల్ కమిషనర్ అంజయ్యతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, పరిశుభ్రమైన వాతావరణం రోగుల ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.






