ఆధార్ కేంద్రాల్లో ప్రజల బారులు
రేషన్ ఈ కేవైసీ చివరి రోజు కావడంతో లబ్ధిదారుల ఆందోళన
ఎల్బీనగర్, జులై 31 : రేషన్ కార్డు కేవైసీ చివరి రోజు కావడంతో పై లబ్ధిదారులల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో రేషన్ లబ్ధిదారులు ఆధార్ కేంద్రాలకు బారులు తీస్తున్నారు. ముఖ్యంగా పిల్లల కేవైసీ కాకపోవడంతో రేషన్ బంద్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇంతలో చివరి గడువు నేటితో ముగియడంతో ఆధార్ కార్డు ఆప్ డేట్ కోసం ఆధార్ కేంద్రాలు కిటకిటలాడాయి. - కేవైసీ పేరుతో రేషన్ డీలర్ల వసూళ్లు..
ఒక్కరికి రూ.100 తీసుకుంటాన్నారని ఆరోపణలు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రేషన్ కార్డుల కేవైసీ ప్రక్రియలో రేషన్ డీలర్ లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవైసీ ప్రక్రియను పూర్తిగా ఉచితంగా నిర్వహించాలని, ఎలాంటి రుసుము వసూలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవైసీ కోసం వచ్చిన లబ్ధిదారుల నుంచి బలవంతంగా రూ.100 చొప్పున తీసుకున్న తర్వాతే ప్రక్రియ పూర్తి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






