మంజీరా పరీవాహకంలో తేలిన భూములు
- శెనగ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు
- కర్ణాటక నుండి విత్తనాలు తెచ్చుకుంటున్న రైతులు
నారాయణఖేడ్, అక్టోబర్ 4: మంజీరా నది(Manjeera River) ఎగువ ప్రాంతమైన రైతులు రబీ పంట(Rabi Chickpea Cultivation) సాగుకు సన్నద్ధమవుతున్నారు. సింగూరు ప్రాజెక్టు(Singur Project) మరమ్మత్తులో భాగంగా ప్రాజెక్టు నీళ్లు దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎక్కువ ప్రాంతమైన ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంత రైతులు నది పరివాహకం వెంట తేలిన భూముల్లో రబీ పంట అయిన శనగ సాగుకు సన్నద్ధమవుతున్నారు. గతంలో ప్రాజెక్టులో భాగంగా మునిగిన భూములు నీరు తగ్గడంతో ప్రస్తుతం భూములు తేలాయి.
దీంతో నది వెంట రైతులు ముమ్మరంగా కల్టివేషన్ పనులను చేపడుతున్నారు. నారాయణఖేడ్ డివిజన్లో రైతులు వరి పంట పైనే ఆశలు పెట్టుకున్నారు. పత్తి సాగు ఆశాజనకంగా లేకపోవడంతో ఆయా గ్రామాల్లోని రైతులు నది పరివాహకం వెంట శెనగ, ధనియాలు, జొన్న వంటి ఇతర పంటలను సాగు చేయడానికి భారీ ఎత్తున సన్నద్ధమవుతున్నారు. నది పరివాహకం వెంట ఉన్న భూములలో రైతులు ఈ ఏడాది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
విత్తనాలను సేకరిస్తున్న రైతులు..
నదీ పరివాహకం వెంట భూములు తేలడంతో శనగ, ధనియా, తెల్లకుసుమ పంట సాగుకు అనుకూలంగా ఉండడంతో రైతులు శనగ విత్తనాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి తీసుకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీదర్ మార్కెట్ నుండి శనగలను రైతులు తీసుకువస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయనున్న శనగ విత్తనాలపై రైతులు అంతగా ఆసక్తి కనబరచడం లేదు.
నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో మంజీరా పరివాహకం వెంట దాదాపుగా అదనంగా మరో 4వేల ఎకరాలు శనగ సాగు పెరగనుంది. కాగా విత్తనాలు కొనుగోలుకు పట్టాపాసు బుక్కులు అడగడంతో రైతులు తక్కువ ధరకు లభిస్తున్న కర్ణాటక వెళ్లి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా మంజీరా నదిలో నీరు తగ్గడంతో ముంపునకు గురైన భూములు తేలడంతో రైతులు పరివాహకం వెంట పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పంట సాగునకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలోని ఆందోలు, రాయికోడ్, వట్పల్లి మండలాలతో పాటు నది పరివాహకం గ్రామాలు అయిన షాపూర్, సిరూరు, రాయిపల్లి, ఉసిరికాపల్లి, బెల్లాపూర్, పుల్కుర్తి మనూరు మండలంలోని బోరంచ, తున్నూరు, ముగ్ధంపూర్, అతి మ్యాల్, ఎన్జీ హుక్రనా, తోర్నాల్, నాగల్గిద్ద మండలంలోని గూడూరు, గొందిగం, కారమంగి ఔదత్ పూర్, షాపూరు, గౌడ్ గాం, జన్వాడ తదితర గ్రామాల్లో ఇప్పటికే మంజీర పరివాహకం వెంట భూమిని కల్టివేషన్ చేసి శనగ సాగుకు సిద్ధమవుతున్నారు.
విత్తనాల కొరత లేకుండా చూస్తాం..
రబీ సీజన్ కు సంబంధించిన శనగ విత్తనాలను పంపిణీకి ఇప్పటికే సిద్ధంగా ఉంచాం. విత్తనాలు కొరత లేకుండా చూస్తున్నాం. రైతులకు అవసరమైతే అదనంగా విత్తనాలు ఇప్పించే ఏర్పాట్లను చేస్తాం. మండలాల వారిగా ఇప్పటికే నివేదికను తెప్పించుకున్నాం. త్వరలోనే విత్తనాలను రైతులకు అందించేందుకు చర్యలను తీసుకుంటున్నాం. మండలాల వారిగా ఆయా వ్యవసాయ కార్యాలయంలో రైతులు అధికారులను సంప్రదించాలి. త్వరలోనే విత్తనాల పంపిణీ చేపడతాం.
- ఏడీఏ ప్రవీణ్ చారి, నారాయణఖేడ్