12 May, 2026 | 4:35 PM

ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. నేరం

12-05-2026 04:00 PM

న్యూఢిల్లీ: నీట్‌ పరీక్ష రద్దుపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. నీట్ రద్దుతో 22 లక్షల విద్యార్థుల కలలు చిన్నాభిన్నం అయ్యాయని,  కఠోర శ్రమ, త్యాగాలు వృథా అయ్యాయని వాపోయారు. కొందరు పేరెంట్స్‌ నగలు అమ్మి, అప్పులు చేసి తమ పిల్లలకు కోచింగ్ ఫీజులు కట్టి చదివించారని, లక్షల మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించిన ప్రతిఫలం ఇదేనా.? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు దారుణంగా నష్టపోతున్నారని, ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. నేరం కూడా అని మండిపడ్డారు. విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే లీక్‌ అవుతుందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.  ప్రతిసారీ పేపర్ మాఫియా శిక్ష లేకుండా తప్పించుకుంటోందని, చేయని తప్పునకు విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న అమృత కాలం యువత పాలిట విషతుల్యమైందని రాహుల్ ఎద్దేవా చేశారు.