12 May, 2026 | 5:07 PM

NEET Exam Cancelled 2026: విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం

12-05-2026 04:29 PM

హైదరాబాద్: నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేయింబవళ్ళు కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని NDA ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందని ఆరోపించారు. 2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందని తెలిపారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) నిర్వహణలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందని, దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర ప్రభుత్వం( Central Government) తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

దీని వెనక ఎంత మంది పెద్దోళ్ల హస్తం ఉన్నా, వాళ్లందరినీ కఠినంగా శిక్షించాలి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కేంద్రాన్ని కోరారు.  నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper leak) అంశంపై కేంద్రం ఇప్పటికే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామో తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. నీట్ పరీక్ష రద్దు కావడంతో కేంద్రంపై విద్యార్థి సంఘాలు, విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీట్ రద్దుపై లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందిందస్తూ కేంద్రంపై మండిపడ్డారు.