రాహుల్ ప్రధాని కావాలి!
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): భారతదేశం ఉద్యోగ, వ్యవసాయ పరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ నాయకత్వంలో పదేళ్ల యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలోని గ్రామీణ, పట్టణ పేదలకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా నిలబెట్టారన్నారు.
సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి దేశ ప్రజలకు ప్రతీ ప్రభుత్వ వ్యవస్థ జవాబుదారీగా ఉండేలా, ప్రతీ సమాచారాన్ని ప్రజల ముం దు ఉంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. నాగార్జున సాగర్ నిర్మాణంతో పాటు ఇక్రిశాట్, బీహెచ్‌ఈఎల్, ఎద్దుమైలారంలో ఆర్డినెన్సు ఫ్యాక్టరీ, పటాన్‌చెరులో బిడిఎల్, ఐడిపిఎల్ లాంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసిన చరిత్ర మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలదని వివరించారు.
దేశంలోని యువకుల ఉద్యోగాల కల్పన కోసం ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఈనాడు ఉపయోగిస్తున్న సెల్ ఫోన్‌లకు బీజం ఆనాడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తెచ్చిన టెలికాం విప్లవమే కారణమని తెలిపారు.






