31 March, 2026 | 5:54 AM

ఆఫ్టర్ నైన్ పబ్‌పై దాడులు

06-05-2024 12:10 AM

యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తింపు

పబ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

160మందిని అదుపులోకి తీసుకున్న వైనం

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (విజయక్రాంతి) : నగరంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా, అవేమీ పట్టించుకోకుండా కొన్ని ప్రాంతా ల్లో అర్ధరాత్రి వరకు పబ్‌లు, బార్‌లు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాలు, లేట్ నైట్ పార్టీలు, ఆశ్లీల నృత్యాలతో హైదరాబాద్‌లోని పబ్‌ల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా శృతిమించిపోతున్నాయి. డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నగరంలో ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. డ్రగ్స్‌కి కేరాఫ్‌గా పబ్‌లు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నగర పోలీసులు పబ్‌లపై దృష్టి సారించారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ‘ఆఫ్టర్ నైన్’ పబ్‌పై శనివారం అర్ధరాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత పబ్ కొనసాగుతున్నదని, అందుకే దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడు ల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 40మంది యువతులతో పబ్ నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని గుర్తించా రు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆఫ్టర్ నైన్ పబ్‌పై కేసు నమోదు చేశారు. దాడుల సమయంలో పబ్‌లో ఉన్నా 160మంది యువతీ, యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరందరి వివరాలు సేకరించిన తర్వాత వారికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి పంపించారు. యువతులను మహిళా పునవారాస కేంద్రాలకు  తరలించినట్లు సమాచారం. మరోవైపు నిషేధిత మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.