వర్షం.. యమపాశం !
హైదరాబాద్ సిటీ బ్యూరో/ మేడ్చల్/ రంగారెడ్డి/ యాదాద్రి భువనగిరి/ నాగర్‌కర్నూల్/ గజ్వేల్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా గాలిదుమారంతో కూడిన అకాల వర్షం కురిసింది. పలుచోట్ల గోడలు కూలి, పిడుగులు పడి, వాహనాలపై చెట్లు పడి వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. తెలిసిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రానికి చెందిన బెల్లె మల్లేష్ (35) అనేవ్యక్తి ఇంద్రకల్ శివారులో కోళ్ల షెడ్డు నిర్మిస్తున్నాడు. మల్లేష్ ఆదివారం పనులను చేయించేందుకు కుమార్తె అనూషతో కలిసి ఇంద్రకల్‌కు వెళ్లాడు. షెడ్డు నిర్మాణానికి కూలీలుగా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన చెన్నమ్మ(32), రాములు (35)తోపాటు మరికొందరు వచ్చారు. పనులు చేస్తుండగా సాయంత్రం ఉన్నట్టుండి గాలిదుమారంతో వర్షం ప్రారంభమైంది. ఈక్రమంలో నిర్మాణ దశలో ఉన్న గోడ కూలింది. ఘటనలో మల్లేష్, అనూష, చెన్నమ్మ, రాములుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, ఇదే ఘటనలో మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను గ్రామస్తులు 108లో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి..
తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన దండు లక్ష్మణ్ (13) అనే బాలుడు తన తండ్రి కలిసి ఆదివారం గొర్రెలు కాసేందుకు పొలాల్లోకి వెళ్లాడు. ఆదివారం సాయంత్రం గాలిదుమారంతో వర్షం మొదలైంది. తండ్రి దీంతో కుమారుడిని చెట్టుకిందకు వెళ్లమని చెప్పాడు. లక్ష్మణ్ వెంటనే సమీపంలోని ఓ చెట్టుకింద కూర్చున్నాడు. ఈ క్రమంలో అక్కడ పిడుగుపడి మొబైల్ పేలి బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన వెంకటయ్య (45) పొలం పని చేస్తుండగా పిడుగుపడి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఎండబెట్లలో పిడుగుపడి రాము అనే పాడి రైతుకు చెందిన ఆవు మృతిచెందింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్‌సింగ్ తండాలో పిడుగుపడి మరో ఆవు మృతిచెందింది.
కారు అద్దం శకలాలు గుచ్చుకుని ఒకరు..
తాండూరుకు చెందిన వేణుగోపాల్ (38) అనే వ్యక్తి ఆదివారం కారులో శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో వర్షం మొదలైంది. వర్షం తెరిపివ్వకపోవడంతో మార్గమధ్యంలోని నాగర్‌కర్నూల్ మండలం మంతటి వద్ద కారును రోడ్డు పక్కకు నిలిపాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న రేకుల షెడ్డు పాక్షికంగా కూలి ఓ ఇటుక కారు అద్దంపై పడింది. దీంతో అద్దం పగిలి దాని శకలాలు వేణుగోపాల్ మెడకు గుచ్చుకుని మృతిచెందాడు.
మేడ్చల్ జిల్లాల్లో చెట్టువిరిగిపడి ఇద్దరు..
మేడ్చల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. కీసర మండలం తిమ్మాయిపల్లి_ శామీర్‌పేట రహదారిపై చెట్టు విరిగి ద్విచక్రవాహనంపై పడింది. ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (48), ధనుంజయ (45) తీవ్రగాయాలపాలయ్యారు. రాంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ధనుంజయను స్థానికులు ఈసీఐఎల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరి మృతిపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పౌల్ట్రీఫాం గోడ కూలి మరో ఇద్దరు..
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో పౌల్ట్రీపాం గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. విభూతి శ్రీనివాస్ అనే రైతు ఆదివారం క్షీరసాగర్‌లోని తన వ్యవసాయ భూమిలో దేవుడిని పెట్టుకున్నాడు. విందుకు బంధువులు, సన్నిహితులను ఆహ్వానించాడు. భోజనానికి తూప్రాన్ మండలం ఘనపూర్‌కు చెందిన గంగా గౌరీశంకర్ (30), చంద్రాయన గుట్టకు చెందిన భాగ్యమ్మ(40) తో పాటు పలువురు హాజరయ్యారు. ఉన్నట్టుండి గాలిదుమారంతో వర్షం మొదలైంది. దీంతో బంధువులంతా పక్కనే ఉన్న శిథిలావస్థలో ఉన్న పౌల్ట్రీఫాంలోకి వెళ్లారు. ఈ క్రమంలో పౌల్ట్రీఫాం గోడ కూలి గంగ గౌరీశంకర్, భాగ్యమ్మ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలను గ్రామస్తులు గజ్వేల్‌లోని ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదే ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇద్దరు..
రంగారెడ్డి జిల్లా మియాపూర్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో గోడ కూలి ఒక చిన్నారి సహా ఓ వ్యక్తి మృతిచెందాడు. తెలిసిన వివరాల ప్రకారం.. మియాపూర్ ఓల్డ్ హాఫిజ్‌పేట్ సాయినగర్‌లో సాయంత్రం ఓ ఇంటి బాల్కనీ కూలి కింద ఉన్న రేకుల షెడ్డుపై శకలాలు పడ్డాయి. ఘటనలో షెడ్డులో నిద్రిస్తున్న చిన్నారి సమాద్ (3) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే ఘటనలో గాయాలపాలైన రషీద్‌ఖాన్ (45)ను స్థానికులు ఓ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తుండగా అక్కడ మృతిచెందాడు.
ఇద్దరికి గాయాలు..
ఇబ్రహీంపట్నం, మే 26, (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల వద్ద ఆదివారం విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై వెళుతున్న ఆటోపై పడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.






