పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
పలు రైళ్ల దారి మళ్లింపు
హైదారాబాద్/సూర్యాపేట, మే 26 (విజయక్రాంతి): గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళుతున్న గూడ్స్ రైలు ఓ పక్కకు ఒరగడం తో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్‌లో ఉండడంతో లోకోపైలట్ చాకచక్యంగా బ్రేక్‌లు వేసి మిగతా బోగీలు పట్టాలు తప్పకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
శబరి ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడలో, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఏపీలోని పిడుగురాళ్లలో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట, వరంగల్ మీదుగా దారి మళ్లించారు. విజయవాడ నుంచి లింగంపల్లి వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు బయలు దేరాల్సి ఉండగా... సుమారు గంట ఆలస్యంగా కదిలింది. సాధ్యమైనంత త్వరగా పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలకు ఆటంకం లేకుండా చూస్తామని ద.మ. రైల్వే అధికారులు తెలిపారు.






