21 July, 2026 | 11:22 AM

భారత్మాల రోడ్డు కింద నిలిచిన వర్షపు నీరు..

21-07-2026 12:00 AM

రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

గట్టు, జూలై 20:  జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని తప్పెట్లమోర్స్ గ్రామం నుంచి అయిజకు వెళ్లే మార్గంలో నిర్మించిన భారత్మాల రహదారి కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో పెద్దఎత్తున నీరు నిల్వ ఉండిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్గం గుండా రైతులు తమ పొలాలకు వెళ్లాల్సి ఉండగా, నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమస్యను పలుమార్లు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.తక్షణమే నీరు వెళ్లేలా డ్రైనేజీ లేదా కాలువ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.