11-11-2025 12:00:00 AM
సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ
కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ తనిఖీ సందర్భంగా రోల్ కాల్ పరిశీలించి, సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయపాలనపై సూచనలు ఇచ్చారు. ప్రతి పోలీసు సిబ్బంది శుభ్రమైన యూనిఫారం ధరించి వృత్తిగౌరవం కాపాడాలని ఆదేశించారు.ఎస్పీ తమ సూచనలు సిబ్బందికి పూర్తిగా చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అలాగే, ఇటీవల జిల్లాలో జరుగుతున్న ఆస్థి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఇలాంటి దొంగతనాలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి, ఎస్‌ఐకి సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహ రించి, ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు కృషి చేయాలని తెలిపారు. ఈ తనిఖీలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, బిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, ఎస్‌ఐ రాజు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.