calender_icon.png 23 February, 2026 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట నిలబెట్టుకున్న రాజశేఖర్!

23-02-2026 12:23:41 AM

ఆడబిడ్డ పుట్టిందని.. అధైర్య పడకండి అండగా నేనున్నా..

పుట్టిన ఆడబిడ్డకు 5వేల కానుక..

మహబూబాబాద్,  ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా తన వార్డులో జన్మనిచ్చిన ప్రతి ఆడబిడ్డకు 5వేల రూపాయలను కానుకగా అందజేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు కౌన్సిలర్ గుండా రాజశేఖర్. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీచేసిన గుండా రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన వార్డులో ఆడబిడ్డ జన్మనిస్తే ఆ కుటుంబానికి రూ. 5వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చాడు.

ఈ మేరకు ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన రాజశేఖర్ వార్డుకు చెందిన అబ్బనపురి లక్ష్మి, నరసయ్య దంపతుల కుమార్తె ఇందు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ తన వార్డులో జన్మించిన ఆడబిడ్డకు పుట్టినరోజు కానుకగా 5వేల రూపాయలతో పాటు కొత్త దుస్తులు అందించి ఆడబిడ్డ పుట్టిందని అధైర్య పడకండి.. అండగా నేనుంటాను అంటూ భరోసానిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలబెట్టుకునేందుకు శ్రీకారం చుట్టిన రాజశేఖర్ కు జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత, వార్డు ప్రజలు జేజేలు పలికారు.