గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది
హైదరాబాద్: బొగ్గు కుంభకోణం నిజాలు బయటకు రాకుండా అణిచివేస్తూ, బీజేపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేయడం రేవంత్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణం బయటపడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై నిరాధార విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బొగ్గు కుంభకోణంపై నిజానిజాలు వెలుగులోకి రావాలని కిషన్ రెడ్డి స్వయంగా సీఎంకి లేఖ రాశారని, సింగరేణి కాలరీస్‌లో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది, 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది అని తెలిపారు.
కానీ స్పష్టంగా చెప్పాలంటే… కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలో ఒక అటెండర్‌ను కూడా నియమించే అధికారాలు లేవని, సింగరేణి అడ్మినిస్ట్రేషన్ అయినా… ఫైనాన్షియల్ పవర్స్ అయినా… పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. అందుకే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, బొగ్గు కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసినట్లు గుర్తు చేశారు. కుంభకోణంపై సమాధానం చెప్పాల్సింది పోయి… బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని రామచందర్ రావు విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల దుస్థితి ఎలా ఉందో రేవంత్ రెడ్డి చూడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం లేవని (No Admission) బోర్డులు పెట్టాల్సి వచ్చిందని గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం పూర్తిగా చంపేస్తోందని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు పెరుగుతున్నాయి..?, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఉన్న ఆదరణ ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు లేదు..? అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు కేటాయింపులు పంచాలని, టీచర్లకు ప్రమోషన్లు లేవు, చాలాచోట్ల డీఈఓలు, ఎంఈఓలు కూడా లేరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యావ్యవస్థను కాపాడాలని, స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్లక్ష్యం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? అమలు ఏది?, ఓయూ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, యూనివర్సిటీలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదన్నారు. బీ హాస్టల్ ఇప్పటికే మూసివేశారు, డీ,ఈ హాస్టళ్లు కూడా మూసివేసే అంచున ఉన్నాయని, ఇప్పటికైనా పాత హాస్టళ్లను వెంటనే పునర్నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. టీచర్లు, ప్రొఫెసర్లు హక్కులు గురించి మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారని, రాష్ట్రంలోని 90 శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు గానీ, కనీస మౌలిక సదుపాయాలు గానీ లేవని తెలుస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచినా, ఇప్పటికీ కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రించలేదు, యూనిఫారాలు కూడా పంపిణీ చేయలేదని రామచందర్ రావు మండిపడ్డారు.






