20 June, 2026 | 6:05 PM

సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలి

20-06-2026 04:31 PM

- రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కృష్ణ నది పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం కాలువల నిర్మాణ పనులపై శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అవసరమైన భూసేకరణ పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.  కల్వకుర్తి 29వ ప్యాకేజీ డైవర్షన్‌లో వెల్డండ మండలం జంగారెడ్డిపల్లి వద్ద రైతుల పంట పొలాల్లోని నీరు కాలువల్లోకి చేరుతున్న అంశాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

కాలువల నీటి ప్రవాహం డైవర్షన్ సిస్టం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో కాలువలపై బ్రిడ్జిల నిర్మాణం అవసరమని సమీప పంట పొలాలు సాగు చేసుకునేందుకు రైతులు సుదూర ప్రాంతాల గుండా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం గుడిపల్లి గ్రామ సమీపంలోని కాలువలకు లైనింగ్ పనులు చేపట్టకపోవడంతో గ్రామంలోని నీటి కుంటలుగా మారుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

వాటికి వెంటనే లైనింగ్ పనులు చేపట్టాలని కోరారు.  చట్టాలను ఉల్లంఘించి కాలువలను ఆక్రమించిన వారిపై, వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్యాకేజీ-28 పరిధిలో 78 వేల ఎకరాల ఆయకట్టులో నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన 68 వేల ఎకరాల పనులు పూర్తయ్యాయని, బుద్దారం ప్రాంతానికి చెందిన మరో 10 వేల ఎకరాల పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వివరించారు. గుడిపల్లి గ్రామంలో కాలువలకు లైనింగ్ లేకపోవడంతో ఇండ్లు ఊరిస్తున్నాయని, ఈ సమస్య ఇపీసీ పరిధిలో ఉందని తెలిపారు.

ప్యాకేజీలు 28, 29, 30 పరిధిలోని కాలువలకు లైనింగ్ పనులు చేపడతామని  ఇరిగేషన్ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందేలా నీటి సరఫరా, సమస్యలు, కారణాలపై ఏఈలు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, రిజ్వాన్ భాషా షేక్, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.