5 March, 2026 | 1:38 PM

భద్రాచలంలో ఘనంగా ప్రారంభమైన రామయ్య కళ్యాణ పనులు

05-03-2026 12:00 AM

మిధున స్టేడియం వద్ద తలంబ్రాలు కలిపిన అర్చకులు, భక్తులు 

భద్రాచలం, మార్చి 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య కల్యాణానికి లాంచనంగా  పనులు మొదలయ్యాయి. ఫాల్గుణ పౌర్ణమి పురస్కరించుకుని వైకుంఠ  ఉత్తర ద్వారo వద్ద బుధవారం పసుపు కొట్టి, స్వామివారి కళ్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు.

ఆలయ అర్చకులు ఆలయ ఈఓ దంపతులు, ముత్తుదువ మహిళలు. ఈ సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేసారు. శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 27, 28 తేదీలలో జరిగే  సీతారాముల కల్యాణం,  పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా  జరగనున్నాయి. అయితే సీతారాముల కల్యాణంలో ఎంతో  ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిపే ఘట్టం బుధవారం నిర్వహించారు.

సీతారాముల ఉత్సవ మూర్తులకు  ప్రత్యేకపూజలు అనంతరం పసుపుకొమ్ములు దంచే కార్యక్రమం శాస్త్రోక్తంగా  నిర్వహించారు అర్చక స్వాములు, మాహిళలు. ముందుగా పసుపుకొమ్ములు దంచే కార్యక్రమం నిర్వహించే వైదిక బృందం సతిమణులు పసుపుకొమ్ములు దంచి పసుపును తయారు చేశారు. అయితే  అనంతరం అత్తర్, గులాల్, బుక్క, పసుపు, కుంకుమ, పన్నీర్ వంటి సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను సిద్ధం చేసారు  మహిళలు.

కళ్యాణాలలో వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉండటం సహజం కానీ ఒక్క భద్రాద్రి క్షేత్రంలో ఈ సీతారాముల కల్యాణానికి  మాత్రమే తలంబ్రాలు గులాబీ రంగులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. తానిషా కాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. డోలోత్సవం, వసంతోత్సవలతో రామయ్యాను పెళ్ళికొడుకును చేసినట్లుగా ఇక్కడి భక్తులు భావిస్తారు. స్వామివారి తలంబ్రాలు కలపడానికి యావన్మంది భక్తజనం ఉదయం నుండి చిత్రకూట మండపం ఎదుట పడిగాపులు పడి మరీ వేచివున్నారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులను అందరిని స్వామివారి తలంబ్రాలు కలపడానికి అనుమతించడంతో ఒక్కసారిగా భక్తులతో మిథిలా స్టేడియం ప్రాంగణం అంతా భక్త జనంతో  నిండిపోయింది.