ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు స్పందించారు. ఆదివారం నాగోలులోని శ్రేయాస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ మాట్లాడుతూ... ఈటల మీద కొందరు అభియోగాలు చేస్తున్నారని, మల్కాజిగిరిలో ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని కుట్రలు చేస్తూ అంతర్యుర్ధం తీసుకురావాలని చూస్తున్నారు. ప్లెక్సీలపై డీజీపీ, సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశామని రామచందర్ రావు పేర్కొన్నారు.
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ భావన, ప్రాముఖ్యతను మీడియాతో మాట్లాడి వివరించారు. భారతీయ జనతా పార్టీ ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తుందని, దేశం ముందు ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా బీజేపీ కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన స్పష్టత, క్రమశిక్షణ, సంస్థాగత నిబద్ధతతో పాటు సమాజం, దేశం పట్ల సేవాభావం మరింత బలపడుతుందని తెలిపారు.
బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ప్రజల కోసం నిరంతరం శ్రమించే అంకితభావం కలిగిన కార్యకర్తలతో నడిచే ఒక ఉద్యమమన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల పాలనతో పూర్తిగా విసిగిపోయారు. అవినీతి, తప్పుడు హామీలు, దుర్వ్యవస్థాపన, ప్రజల పట్ల నిర్లక్ష్యాన్ని రెండు పార్టీల పాలనలో ప్రజలు చూశారని, తెలంగాణకు స్వచ్ఛమైన పాలన, అభివృద్ధి, బలమైన భవిష్యత్తును అందించగల ఏకైక విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని రామచందర్ రావు వెల్లడించారు.






