రంగమేదైనా రామోజీ మార్క్
ఆయనొక అక్షర యోధుడు
మీడియా మొఘల్‌గా కీర్తి
కఠోర శ్రమే రామోజీ విజయరహస్యం
రామోజీరావు ప్రస్థానం ఇది
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలుగు మీడియా మొఘల్ కీర్తిగాంచిన రామోజీరావు అస్తమించారు. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామోజీరావు తన జీవితంలో ఏ వ్యాపారంలో అడుగుపెట్టిన చెరగని ముద్రవేశారు. ఈనాడు, ఈటీవీ, ప్రియా ఫుడ్స్, మార్గదర్శి, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, అడ్వర్టుజ్‌మెంట్ ఇలా ఏ రంగంలోనైనా రామోజీ తన మార్క్ చూపించారు.
తన పేరును తానే పెట్టుకున్నారు!
కృష్ణాజిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు తల్లిదండ్రులు చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత రామోజీ జన్మించారు. అయితే ఆయన కుటుంబసభ్యులు రామోజీరావుకు తాతయ్య రామయ్య పేరును పెట్టారు. అయితే ఆయనకు ఆ పేరు నచ్చక చిన్నప్పుడు పాఠశాలలో చేరినప్పుడు రామోజీరావుగా మార్చుకున్నారు.
ఢిల్లీలో అడ్వర్టుజింగ్ ఏజెన్సీలో ఉద్యోగం..
రామోజీ చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరారు. తన చదువు పూర్తయ్యాకా ఢిల్లీలో ఒక అడ్వర్టుజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్లు అక్కడే పనిచేశారు. 1962లో అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేశారు.
1962లో చిట్‌ఫండ్ వ్యాపారం...
1962 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1965లో కిరణ్ యాడ్స్ పేరుతో అడ్వర్టుజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. 1967 ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ ఎరువుల వ్యాపారాన్ని కూడా చేశారు. 1969లో రామోజీరావు మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టుజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు.
ఈనాడుతో మీడియాలో పెను మార్పులు..
1970లో విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభమయ్యాక 1974 ఆగస్టు 10న ఈనాడు దినపత్రికను విశాఖ వేదికగా ప్రారంభించారు. పత్రిక రంగంలోనే ఈనాడు పెనుసంచలనంగా మారింది. వేగంగా వార్తలను, కథనాలను తనదైన శైలీలో ఈనాడు తీసుకువచ్చేది. సూర్యోదయం తరువాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదని రామోజీ అనేవారు.
అప్పటి వరకు పత్రిక వావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి 1977లో ఆయన చరమగీతం పాడారు. సొంతంగా ప్రైవేట్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేశారు. ఇది ఆనాడు పత్రికా రంగంలోనే పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. తొలినాళ్లలో ఐదారు వేల కాపీలతో ప్రారంభమైన ఈనాడు ఆ తర్వాతి కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. తన అన్ని వ్యాపారాల్లోకెల్లా ఈనాడు పత్రికను రామోజీరావు విపరీతంగా అభిమానించేవారు.
ప్రియా పచ్చళ్లతో
1980లో ప్రియా ఫుడ్స్ పేరుతో ప్రియా పచ్చళ్లను అందుబాటులోకి రామోజీ తెచ్చారు. చాలా తక్కువ కాలంలోనే ప్రియా పచ్చళ్లు తెలుగువారికి చేరవవ్వడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పచ్చడి ప్రియులకు ఫేవరేట్‌గా మారాయి. ఆ తర్వాత ఉషాకిరణ మూవీస్ బ్యానర్‌ను ప్రారంభించి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను నిర్మించారు. దూరదర్శన్ చానెల్‌ను మాత్రమే చూసే రోజుల్లో రోజంతా ప్రేక్షకులు టీవీకు అతుక్కునిపోయేలా ఈటీవీ.. మీటీవీ అంటూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించారు.
విద్యాభ్యాసం...
రామోజీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా ఊరిలోనే సాగింది. తరువాత 1974లో గుడివాడలో 8వ తరగతి చదువు మొదలుపెట్టిన ఆయన బీఎస్సీ వరకు అక్కడే చదువుకున్నారు.1961లో రామోజీరావుకు పెనమలూరుకు చెందిన రమాదేవితో వివాహం అయ్యింది. ఇక్కడ ఉన్న విచిత్రమేమంటే ఆమె అసలు పేరు రమణమ్మ. ఆమెకు కూడా తన పేరు నచ్చక రామోజీలానే పేరును రమాదేవిగా మార్చుకున్నారు.
కొంగుచాటు బిడ్డలా...
ఇద్దరు ఆడపిల్లలు తర్వాత పుట్టిన మగబిడ్డ కావడంతో రామోజీ అంటే విపరీతమైన ప్రేమను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చూపించేవారు. తల్లి కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమెకు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేస్తూ ఉండేవారు. రామోజీ తల్లి దైవ భక్తురాలు. ఆమె నుంచి రామోజీకి భక్తి, శుచి, శుభ్రత అలవడ్డాయని ఆయన గురించి తెలిసిన వారు చెప్తుంటారు.
కఠోర సాధనే ఆయన అస్త్రం...
రామోజీ బహుముఖ ప్రజ్ఞాశాలి. కఠోర సాధనే ఆయన అస్త్రం. నలుగురు నడిచిన దారుల్లో ఆయన నడవరు. కొత్త దారులను సృష్టిస్తారు. లక్ష్య సాధనకు నిర్విరామంగా సాధన చేస్తారు. రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రస్థానం వ్యాపారవేత్తగా ఎదిగారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు రామోజీరావు.
వేలాది మందికి ఉపాధి...
ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయం సాధించిన రామోజీరావు 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్‌ను స్థాపించి దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్ సంస్థగా తీర్చిదిద్దారు. 60 ఏళ్లలో లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలందించడమే కాకుండా మార్గదర్శి, ఈనాడు, రామోజీ ఫిలింసిటీ తదితర వ్యాపార రంగాల్లో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఆయన కల్పించారు. ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రారంభించి ఔత్సాహిక జర్నలిస్టులను తయారు చేయడంలో రామోజీ పాత్ర చెప్పుకోదగ్గది.






