31 August, 2026 | 12:03 PM

పాత్రికేయానికి కొత్త మార్గదర్శి

09-06-2024 02:40 AM

పత్రికా రంగంలో రామోజీ ఎన్నో మార్పులు 

సరళమైన వ్యవహారిక భాషకు పెద్దపీట 

సామాన్యుడికి అర్థమయ్యేలా పత్రిక భాష

గ్రామీణ వార్తలకు ప్రాధాన్యమిచ్చిన ఈనాడు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలుగు పత్రికా రంగంపై రామోజీరావు తనదైన ముద్ర వేశారు. ప్రపంచంలో ఎంతమంది మీడియా అధినేతలున్నా ఆయన మార్క్ ప్రత్యేకం. మీడియా ద్వారా ఒక జాతిని, భాషను ప్రభావితం చేసిన అసలు సిసలు పాత్రికేయుడు రామోజీరావు. ఈనాడు, ఈటీవీ, అరచేతిలో సమాచారమిచ్చే ఈటీవీ భారత్ ఇలా ఒకటేంటి, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్.. ఆయన ఏ మాధ్యమంలో అడుగుపెట్టినా అదో సంచలనం.

అనేక ప్రయోగాలతో మీడియా రంగంలో సరికొత్త సాహసాలు చేసిన యోధుడు రామోజీరావు. మాతృభాషాభివృద్ధికి ఎంతగానో పరితపించారు. సరళమైన వ్యవహారిక భాషకు పెద్దపీట వేసి సామాన్యుడికి సైతం పత్రికను చేరవేశారు. గ్రామీణ వార్తలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయన తీసుకువచ్చిన జిల్లా ఎడిషన్లు తెలుగు పత్రికారంగం మొత్తం ఆయనను అనుసరించేలా చేసింది. ఆంగ్లభాష పదాలకు బదులుగా అచ్చతెలుగు పదాలను ఆయన అందరికీ పరిచయం చేసి భాషపై ఆయనకున్న ప్రేమను చాటారు.

పాఠకుల అభిరుచికి తగ్గట్లుగా... 

పాఠకుల అభిరుచికి పట్టం కడుతూ నిత్యనూతనంగా ముందుకు సాగడమే ఈనాడు ప్రయాణం. ఆ క్రమంలో ఎడిషన్‌లో ఎన్నోమార్పులు జరిగాయి. అవి ప్రజలకు మరింత చేరువవుతూనే ఉన్నాయి. దీనికి కారణం రామోజీరావు చేసిన అనేక ప్రయోగాలే. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జిల్లా ఎడిషన్లు. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చేలా, అట్టడుగువర్గాల సమస్యలకు అద్దం పట్టేలా రామోజీరావు తెచ్చిన మినీ ఎడిషన్లు పెనువిప్లవాన్నే సృష్టించాయి. గ్రామీణ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వారికి చేరువ అయ్యింది ఈనాడు.

పత్రికా ప్రకటనల రంగంలోనూ ఈనాడు ట్రెండ్ ఫాలో కాకుండా కొత్తట్రెండ్ సృష్టించింది. ప్రకటనల కోసం ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన అగత్యం నుంచి బయటపడి ప్రజలకు లాభం చేకూర్చే, ఉపయోగపడే క్లాసిఫైడ్ ప్రకటనల సంస్కృతిని తెలుగులో మొట్టమొదట ప్రవేశపెట్టింది ఈనాడే. ఆదివారం రోజువారీ వార్తలకు భిన్నమైన సమాచారం ఆస్వాదించేలా వైవిధ్యభరితమైన అనుబంధ పేజీ అందజేసింది. తదనంతరం ఒక పుస్తకరూపంలో ఆకర్షనీయంగా చిత్రవిచిత్ర మాలికల సమాహారంగా తీర్చిదిద్దింది.

మహిళా వివక్షత, సమస్యలపై పోరాటం...

అనాదిగా వివక్షకు గురవుతూ వచ్చిన మహిళల సమస్యలు, వారి విజయగాథలు సమాజానికి తెలియాలని గుర్తించిన అభ్యుదయ సంపాదకుడు రామోజీరావు. 1992 సెప్టెంబరులో అలా మొదలైందే ఈనాడు వసుంధర పేజీ. మహిళలకోసం ఒక ప్రత్యేక పేజీ ఏర్పాటు చేసిన తొలి దేశీయ పత్రిక ఈనాడే. అంతేకాదు తెలుగు పత్రికా రంగంలో తొలిసారిగా విద్యార్థుల కోసం ప్రతిభ పేజీని, వాణిజ్య వార్తలు కావాలనుకునే వారికోసం బిజినెస్ పేజీని, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే రైతేరాజు పేజీని ప్రారంభించింది కూడా ఈనాడే.. విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసే చదువు పేజీ, ఆరోగ్యంపై అవగాహన పెంచే సుఖీభవ, క్రీడా సమాచారాన్ని అందించే ఛాంపియన్, శాస్త్ర సాంకేతిక పురోగతికి అద్దం పట్టే ఈ- పేజీ, మదుపరులకు మార్గనిర్దేశం చేసే సిరి, యువతరంలో జోష్ నింపే ఈతరం, పిల్లల కోసం హాయ్ బుజ్జీ, ఇలా అన్ని వర్గాలకూ ఆసక్తికరమైన వార్తల్ని, సమాచారంతో అన్ని వర్గాల పాఠకులకు చేరువైంది ఈనాడు. 

సాహితీ ప్రేమికులకు చతుర, విపుల 

1978లో సాహితీ ప్రేమికుల దాహం తీర్చేలా చతుర, విపుల మాసపత్రికలు ప్రారంభించారు రామోజీరావు. నెలకో నవలతో చతుర, వివిధ భాషా కథల సమాహారంగా తెచ్చిన విపుల సాహిత్యరంగంలో వినూత్న ప్రయోగం. ఎందరో అసాధ్యమని భావించే సాహిత్య పత్రికల్ని 4 దశాబ్దాలపాటు నిరాటంకంగా నడిపారు. ఎందరో రచయితలకు వేదికగా ఈ రెండు మాసపత్రికలు నిలిచాయి. ఈ రెండింటి కోసం పాఠకులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదంటే అతిశయోక్తి కాదు. కాలక్రమంలో టెక్నాలజీ వల్ల వీటికి ఆదరణ తగ్గిపోయింది. ఆ తర్వాత కొంత కాలం వీటిని ఇంటర్నెట్‌లో నడిపించినా ఆ తర్వాత మూసేశారు. కానీ నేటికీ తెలుగు వారందరికీ చతుర, విపుల అనే పేర్లు మాత్రం గుర్తుండిపోయాయి. 

రైతుకు అండగా అన్నదాత

1969లో అన్నదాత మాస పత్రిక ద్వారా మీడియా రంగంలో తొలి అడుగువేశారు. రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు కర్షక లోకానికి అందించిన కరదీపిక అన్నదాతతో వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలు, కర్షకులకు మధ్య తిరుగులేని వారధి నిర్మించారాయన. సేద్యంలో అధునాతన విధానాలు, సాంకేతిక పద్ధతులు, కొత్త యంత్రాలపై ఎనలేని సమాచారం ఇచ్చారు. తెలుగు రైతుల్ని మూస విధానాలు వదిలేసి ప్రయోగాల బాటపట్టించారు. కోట్లాది మంది రైతులకు వ్యవసాయ విజ్ఞాన ఫలాలు అందించింది.

సాంకేతికతను అందిపుచ్చుకుని...

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే ఈనాడు అన్నింటికన్నా ముందే అంతర్జాలంలో అడుగుపెట్టింది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఈనాడు వార్తలు అందించాలనే ఆశయంతో 1999లో ఈనాడు డాట్ నెట్ వెబ్‌సైట్ ప్రారంభించారు. దాని ద్వారా తాజా వార్తలు వేగంగా ఎప్పటికప్పుడు అందిసున్నారు. 1984 జనవరి 26న న్యూస్ టైం ఆంగ్ల దినపతత్రికను ప్రారంభించారు. 20 ఏళ్ల ఆ సంస్థ ప్రస్థానంలో వందల మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించారు.

ఈనాడుతో ఆరంభం...

1974లో మీడియా రంగ ప్రస్థానంలో రామోజీరావు వేసిన మలి అడుగు సంచలనమైంది. అదే తెలుగునాట అత్యధిక సర్క్యులేషన్‌తో పాఠకాదరణ పొందిన ఈనాడు. విశాఖపట్నం కేంద్రంగా పురుడుపోసుకుంది ఈనాడు. తేనెలొలికే తెలుగు భాషకు అక్షర పాత్రగా మారింది. ప్రజా సమస్యల పట్ల నిబద్ధత, నిత్యం నిజానికి కట్టుబడే నిష్ఠలే ప్రాథమిక లక్షణాలుగా పునికిపుచ్చుకున్న ఈనాడు తెలుగు పాఠకుల దినచర్యలో భాగమైంది. ఈనాడులో అచ్చు అయిందంటే అది శిలాక్షరమే అని అసంఖ్యాక పాఠకులు నమ్మేలా మారింది.

కరోనా సమయంలో ఇక పత్రికల పని అయిపోయినట్లేనని చాలా మంది అనుమానించినా ఈనాడు వాటన్నింటినీ పటా పంచలు చేసింది. నిత్యం ఉషోదయానికి ముందే సత్యం నినదించుగాక.. ఈనాడు నిర్వహణలో రామోజీరావు ఆచరించిన సిద్ధాంతమిదే. ఆ సిద్ధాంతం తెలుగు పత్రికల గతినే మార్చింది. ఈనాడు రాకముం దు పత్రికలు ఏ మధ్యాహ్నానికో, సాయంత్రానికో గానీ పాఠకుడికి చేరేవి కావు. ఆ పరిస్థితిని మార్చేశారు రామోజీరావు. పత్రిక బట్వాడా వ్యవస్థ నుంచి ఏజెంట్ల నియామకం వరకూ అన్ని రంగాల్లోనూ కొత్త ఒరవడి సృష్టించారు.

తెల్లవారకముందే దినపత్రికను పాఠకుడి ఇంటికి చేర్చే అధ్యాయానికి రామోజీరావే నాందిపలికారు. జాతీయ, అంతర్జాతీయ వార్తలు, నేతల ప్రకటనలు, బహిరంగ సభల్లో ప్రసంగాలతో నింపేసే మూసధోరణికి ముగింపు పలికింది ఈనాడు. తెలుగు జర్నలిజాన్ని పల్లె బాట పట్టించింది. అసలైన వార్తలు దేశ, రాష్ర్ట రాజధానుల నుంచి వెలువడేవి కావని, మారుమూల పల్లెల్లో నిస్సహాయ ప్రజలు అనుభవించే కష్టాలే పత్రికల ప్రాధాన్యం కావాలన్నది రామోజీరావు నమ్మకం. దానికే ఈనాడు కట్టుబడింది. అందుకు అనుగుణంగానే స్థానిక ప్రజా సమస్యలకు పెద్దపీట వేయడం తొలి సంచిక నుంచే మొదలైంది. నాటి నుంచి నేటి వరకూ స్థానిక జన జీవనంతో ముడిపడిన వార్తలే ఈనాడుకు పంచప్రాణాలు.

వాడుక భాషకు ప్రాధాన్యం...

తెలుగు పత్రికారంగంలో గ్రాంథిక వాసనల్ని తుదకంటా తుడిచిపెట్టి ప్రజల భాషకు పట్టం కట్టింది ఈనాడే. అచ్చ తెలుగు పదాలు, నుడికారాలు, తీరైన వాక్యాలు ఈనాడు భాషాసిరులు. శీర్షిక ఆకర్షణీయంగా ఉండి పాఠకుణ్ని వార్తలోకి లాక్కెళ్లాలనేది రామోజీరావు ధోరణి. ‘జనమా బంతిపూల వనమా!’, ‘హితులారా ఇక సెలవు’, ‘చేసింది చాలు గద్దెదిగు లాలూ’, ‘మామూళ్లు ఇవ్వకుంటే నూరేళ్లు నిండినట్లే’ వంటి ఈనాడు తరహా శీర్షికలు అలాంటివే. తెలుగు భాష పూర్తిగా ఆంగ్లమయం అవుతున్న తీరు రామోజీరావును కలిచివేసేది.

తను ప్రాణ సమానంగా భావించే ఈనాడులో ఆంగ్లాన్ని పూర్తిగా పరిహరించాలని కంకణం కట్టుకున్నా రు. పత్రికలోనూ, ఈటీవీ వార్తల్లోనూ ఆంగ్ల పదాలు దొర్లకుండా కట్టడిచేశారు. ఈ క్రమంలో వందల కొద్దీ తెలు గు పదాలు పురుడుపోసుకున్నాయి. సంపాదక బృందంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పద సృష్టికర్త అయ్యారు. గగనసఖి (ఎయిర్ హోస్టెస్), అంతర్జాలం (ఇంటర్నెట్), దస్త్రం (ఫైల్), బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), గుత్తేదారు (కాంట్రాక్టర్), మేఘమథనం (క్లౌడ్ సీడింగ్), శతకం (సెంచరీ) వంటి పదాలు, ఐకాస (జేఏసీ), అనిశా (ఏసీబీ), తెదేపా (టీడీపీ), తెరాస (టీఆర్‌ఎస్), తితిదే (టీటీడీ) వంటి సంక్షిప్త రూపాలు చాలావరకు ఈనాడు నుంచి పుట్టినవే. బల్దియా (మున్సిపల్ కార్పొరేషన్), లష్కర్ (సికింద్రాబాద్), గల్లీ (వీధి), ముక్కాలు (ముప్పావు) వంటి మాండలిక పదాల్ని కూడా ఈనాడు ప్రాచుర్యంలోకి తెచ్చింది.