జోరుగా అక్రమ షెడ్ల నిర్మాణం
మున్సిపల్ అనుమతులు బేఖాతర్
పర్యవేక్షణ లేక రాజ్యమేలుతున్న అక్రమార్కులు
కోట్లల్లో మున్సిపల్ ఆదాయానికి గండి
అబ్దుల్లాపూర్‌మెట్, మే 27 : అధికారుల నిర్లక్ష్యంతో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, తద్వారా కోట్లల్లో మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోందని విమర్శలు వినిపిస్తున్నా యి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ సమీపంలోని వీ.ఎమ్.ఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా సాగర్ ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమ షెడ్ల నిర్మాణం యధేచ్ఛగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు మాత్రం తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
సామాన్య ప్రజలు తమ ఇంటి నిర్మాణాలు చేపడితే ఏదో ఒక లోపాన్ని చూపే అధికారులు, అస లు అనుమతులే లేకుండా షెడ్ల నిర్మాణం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటు అధికారులు, అటు స్థానిక ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు అందుతున్నా యనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో కొందరు అవినీతి అధికారులు ఇలాంటి చట్ట వ్యతిరేక నిర్మాణాలకు పాల్పడటం వల్ల మున్సిపల్ ఖజానాకు కోట్లల్లో చిల్లు పడుతోందంటున్నారు.
ఇలా మున్సిపాలిటీలకు రావాల్సిన చట్టబద్దమైన పన్ను లు, అనుమతుల ఫీజుల విషయంలో అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నా రని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి. సాగర్ హైవేకు ఆనుకుని బహిరంగ ప్రదేశంలో ఉన్న అక్రమ నిర్మాణాలపైనే పర్యవేక్షణ లేకుంటే ఇంకా మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా ఈ అక్రమ షెడ్ల నిర్మాణంపై మున్సిపల్ చైర్మన్ స్పందించి, మున్సిపల్ ఆదాయానికి గండి పడకుండా చూడాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్ట పరమైన చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్‌ను విజయక్రాంతి ప్రతినిధి వివరణ కోరగా.. తన కార్యాలయంలోని వార్డు ఆఫీసర్‌ను అక్రమ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాల వద్దకు పంపించామని అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణంపై నోటీసులు ఇద్దామంటే ఆ స్థలం సర్వే నెంబర్ తెలియదని, అక్కడ ఎవ్వరిని అడిగిన చెప్పడంలేదంటూ సమాధానం ఇచ్చా రు. చివరిగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని నిర్లక్ష్యంగా బదులిచ్చారు.






