1 August, 2026 | 8:54 PM

కేసిఆర్ పాలనలో తెలంగాణ పండుగలకు విశేష గుర్తింపు మాజీ మంత్రి సబితా

01-08-2026 08:15 PM

బడంగ్ పేట్,(విజయక్రాంతి): మాజీ ముఖ్య మంత్రి కేసిఆర్ పాలనలో తెలంగాణ పండుగలకు తగిన గుర్తింపు ఇవ్వడమే కాకుండా అధికారికంగా నిర్వహించేందుకు అన్ని  ఏర్పాట్లు చేయడం జరిగిందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం జిహెచ్ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ జిల్లెల్లగూడ మచ్చ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బోనాల పండుగ ఆలయాల అభివృద్ధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, టియుఎఫ్ఐడిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డితో కలిసి చెక్కులను అర్చకులు, ఆలయ కమిటీల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ.. అన్ని మతాల పండుగలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగలను అధికారికంగా నిర్వహించిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

కేసిఆర్ పాలనలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తేవడం జరిగిందన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు ఎలా ఆర్థిక సహాయం చేయడం జరిగిందో, అలాగే రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారన్నారు. అంతేకాకుండా, బోనాల సందర్భంగా ఆలయాల అభివృద్ధి నిధుల కోసం కొత్తగా దరఖాస్తు (అర్జీ) చేసుకున్న అర్హులైన వారందరికీ కూడా ఇలాంటి చెక్కులను ప్రభుత్వం త్వరితగతిన అందజేయాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బోనాల పర్వదిన సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత కలలు నెరవేరాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.