దర్జాగా కబ్జా..
- పుట్‌పాత్‌లు కనుమరుగు
- అక్కడే వ్యాపారుల క్రయవిక్రయాలు
- యథేచ్ఛగా రహదారి ఆక్రమణలు
- ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు
- చోద్యం చూస్తున్న అధికారులు
మెట్‌పల్లి, జులై 10 (విజయక్రాంతి): అధికారులు, ప్రజాప్రతినిధుల ఆలసత్వంతో పట్టణంలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పుట్ పాత్ లు కబ్జాలకు గురి అయి కనుమరుగు అవుతున్నాయి. ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న పుట్ పాత్ లు వ్యాపార సంస్థలకు విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయి. దింతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
దర్జాగా పుట్‌పాత్‌లపైనే విక్రయాలు..
పట్టణ పరిధిలోని ప్రధాన ప్రాంతాలైన కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ నుండి బస్ డిపో వరకు గతంలో మున్సిపల్ అధికారులు కోట్ల నిధులు వెచ్చించి పుట్ పాత్ లను నిర్మించడం జరిగింది.దింతో ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరాయని అనుకుంటున్నా సమయంలో, స్థానిక వ్యాపారులు ఫుట్ పాతులను ఆక్రమించి తమ వస్తువులను పెట్టి అమ్మకాలు చేయడం మొదలు పెట్టారు. దింతో పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు మళ్లీ ట్రాఫిక్ కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఫుట్ పాతుల కబ్జాలతో జాతీయ రహదారి ఇరుకుగా మారి తరచుగా ప్రమాదాలు సభావించి పలువురు ప్రాణాలు పోయిన ఘటనలు కూడా నెలకొంటున్నాయి.
జాతీయ రహదారిపైనే వాహనాలు..
కొత్త బస్ స్టాండ్ నుండి డిపో వరకు జాతీయ రహదారి కావడంతో ఎప్పుడు పదుల సంఖ్యలో భారీ వాహనాలు అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.అలాగే వ్యాపారులు పుట్ పాత్ లను ఆక్రమించు కోవడంతో నడుచుకుంటూ వెళ్లే ప్రజలు జాతీయ రహదారి పైనే వెళ్లాల్సి రావడంతో తరచూ ప్రమాదాలు సంభావిస్తున్నాయి.
వ్యాపారులు పుట్ పాత్ తో పాటు రోడ్డును కబ్జా చేయడం తో ద్విచక్ర వాహనాలు, కార్లు రహదారి పైనే పార్కింగ్ చేస్తున్నారు. దింతో ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి పై ఎప్పుడైనా పెద్ద వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ప్రయాణికుల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
పట్టించుకోని సంబంధిత అధికారులు..
ప్రభుత్వం కోట్లు వెచ్చించి నిర్మించిన పుట్ పాత్ లను వ్యాపారులు కబ్జా చేసి తమ సామానులు పెట్టి క్రయ విక్రయాలు చేస్తున్న సంబందిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం అనుమానాలకు తావిస్తోంది.
ముఖ్యంగా కొత్త బస్ స్టాండ్,పాత బస్ స్టాండ్, సాయి కృష్ణ థియేటర్ నుండి బస్ డిపో వరకు పుట్ పాత్ లు కనిపించకుండా వ్యాపారులు తమ సామాగ్రితో నింపడంతో పండగ రోజులు, మంగళవారం సంత రోజులలో ప్రజల కష్టాలకు అంతులేకుండా పోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోకుండా పుట్ పాత్ అక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠినచర్యలు తప్పవు..
పట్టణంలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పుట్ పాత్‌లను ఆక్రమించి ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. అవసరం అయితే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తాం.
శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, మెట్‌పల్లి






