యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
తూప్రాన్, జూన్ 4: తూప్రాన్ మండలం యావాపూర్ సమీపంలోని వాగులో నుండి రాత్రుల్లో అక్రమ ఇసుక వ్యాపారస్తులు అక్రమంగా ఇసుకను దొంగిలించి అమ్ముకుంటు న్న ఘటన వెలుగులోకి వచ్చింది. యావపూర్ గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా అక్రమంగా ఇసుకను తవ్వుతున్న స్థలానికి రెవెన్యూ అధికారులు వెళ్లి పరిశీలించి డంపు చేసిన ఇసుకను స్వాధీన పరుచుకున్నారు.
గత కొంతకాలం నుండి కిష్టాపూర్ లోని కొందరు రాజకీయ ముసుగుల్లో అక్రమ ఇసుక వ్యాపారం కొనసాగిస్తు పబ్బం గడుపుతున్నారు. రాజకీయంగా ప్రజాప్రతినిధులమని చలామణి అవుతూ రాత్రుల్లో ఇలాంటి అక్రమ ఇసుక దందాను నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ లక్షలు దండుకుంటున్నారు. ఇలాంటి వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.






