తెలంగాణ నుంచి మహారాష్ట్రకు!
పక్కదారి పడుతున్న పేదల బియ్యం
పగలు సేకరణ, రాత్రుల్లో తరలింపు
ఉత్తర తెలంగాణలో ఆగని దందా
అధికారులకు ఆమ్యామ్యాలు!
మంచిర్యాల, జూన్ 14 (విజయక్రాంతి): ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యం పక్క దారి పడుతున్నది. పీడీఎస్ బియ్యం ప్రతి రోజు పదుల సంఖ్యలో ఆటోలు, ట్రాలీలు, డీసీఎం వాహనాల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలుతున్నది. సంబంధిత శాఖ అధికారులకు, పోలీసులకు తెలిసే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పగలంతా పేదల నుంచి బియ్యాన్ని కిలోకు రూ.10 నుంచి రూ.12 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని వాహనాల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకి రూ.20 నుంచి రూ.22లకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజు టన్నుల కొద్ది బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
మహారాష్ట్రలోని సిరోంచకు బియ్యం
ప్రస్తుతం ఈ అక్రమ దందాను పగలు సైతం జరుపుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచే కాకుండా ఉత్తర తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం ప్రతి రోజు ఏదో ఒక విధంగా మహారాష్ట్రలోని సిరోంచకు చేరుతుంది. బియ్యం సేకరణ, తరలింపు ఒక నెట్ వర్క్‌లా సాగుతుంది. ఎవరు, ఎంత మంది, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఎన్ని క్వింటాళ్ల బియ్యం సేకరించారనేది ఏరోజుకారోజు సమాచారం అందుతుంది.
పెద్ద మొత్తంలో ఉంటే వ్యానులు, లారీల ద్వారా, చిన్న మొత్తంలో అయితే ట్రాలీలు, ఆటోల ద్వారా తరలిస్తుంటారు. ఈ తరలింపు సమయంలో నెట్ వర్క్ లోని కొందరు ముందుగానే ఆ రూట్ లో ఏమైనా తనిఖీలున్నాయా? పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు వాహనాలు ఆపుతున్నారో, లేదోనని క్లియరెన్స్ ఇస్తుంటారు. వారి సూచనల మేరకు పెద్ద వాహనాల్లో బియ్యం రాష్ట్రం దాటుతుంది.
దందాపై కరువైన నిఘా!
పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్నా అధికారులకు పట్టుబడుతున్న సంఘటనలు మాత్రం అంతంతే. కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులకు ఆమ్యామ్యాలు ముడుతుండటం వల్లనే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి.






