16 August, 2026 | 6:57 PM

రేపు రంగనాయకస్వామి రథోత్సవం

16-08-2026 06:25 PM

ఘట్ కేసర్, ఆగష్టు 16 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ లోని శ్రీగోదాసమేత శ్రీమన్నారు రంగనాయకస్వామి రథోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరుగనుంది. ప్రతియేటా శ్రావణమాసంలో వారం రోజుల పాటు ప్రత్యేక పూజలతో ఉత్సవాలు జరుగుతున్నవి. 650 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన దేవాలయాన్ని గ్రామస్థులు, వంశపారంపర్య ధర్మకర్తలు సమిష్టి సహకారంతో ఆలయానికి మరమ్మత్తులు చేయించి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

బ్రహ్మోత్సవాలతో గ్రామ పొలిమేర నుంచే జాతర సందడి మొదలవుతుంది. జాతర సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. దసరా, దీపావళి, బతుకమ్మ పండగలకు రాకున్నాకాని రంగనాయకస్వామి జాతరకు మాత్రం బంధుమిత్రులు తండోపతండాలుగా తరలివస్తారు. రంగనాయకస్వామి కరుణాకటాక్షాలను పొందాలన్న తలంపుతో వచ్చే వేలాది మంది భక్తజనులతోనే ఈ దేవాలయం విశిష్టత తేటతెల్లం అవుతుంది.