24-04-2025 01:57:38 AM
ఇదేం చైతన్యం.. నారాయణా!
ఒకే విద్యార్థి.. ఒకే ర్యాంకు రెండు కాలేజీల్లో!
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని శ్రీచైతన్య, నారా యణ విద్యాసంస్థల లీలలకు అంతే లేదు. ఆ విద్యాసంస్థల మోసాలకు లెక్కే లేదు. ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్ ర్యాంకులతో వాటి మోసం మరోసారి బట్టబయలైంది. జేఈఈ మెయిన్ 2025 ఫలితాలు ర్యాంకుల మాటున తిమ్మిని బమ్మిచేసే విధంగా విడుదల చేసిన ప్రకటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులను బురిడీ కొట్టించారు.
ధనార్జనే ధ్యేయంగా.. వందల కోట్ల రూపాయల వ్యాపారమే లక్ష్యంగా ఒకే ర్యాంకును రెండు కాలేజీలు తమదంటే తమదని ప్రక టించుకున్నాయి. విద్యను వ్యాపారంలా మార్చడంలో అందెవేసిన ఈ విద్యా సంస్థలకు ప్రకటనలతో ఊదరగొట్టడం పరిపాటిగా మారింది. చట్టాలు తమకు చుట్టాలేనని.. నిబంధనలు తమ కాం పౌండ్‌లో వర్తించవన్నట్లుగా ఆ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి.
తమ కాలేజీల్లో చదివితే ఆలిండియా స్థాయిలో ర్యాంకులకు కొదువేలేదని భ్రమను విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కలిగిస్తున్నాయి. అది నిజమని నమ్మి తెలియక వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తెలంగాణలోని శ్రీచైతన్య, నారాయ ణ కాలేజీల్లో చేర్పిస్తున్నారు.
పిల్లల భవి ష్యత్తుపై చింతించే తల్లిదండ్రులు ఈ కార్పొరేట్ సంస్థలకు ఎరగా మారుతు న్నారని, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ సంస్థలు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నాయకులు విజయక్రాంతితో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోసపోతున్న తల్లిదండ్రులు..
శ్రీచైతన్య, నారాయణ కాలేజీల దారుణాలు చూస్తే వామ్మో అనాల్సిందే. ఇంత దారుణానికి, బూటకానికి పాల్పడుతున్నారా? అని తెలిసినవారు ఎవరైనా అనకమానరు. ఎక్కడో చదివిన విద్యార్థిని మా విద్యార్థే అంటూ ఆ కాలేజీలు మోసపూరిత ప్రకటనలను బహిరంగంగా ఇచ్చుకుంటున్నాయి. ఎవరూ తమను ఏం చేయలేరనో.. లేక అధికారులు, ప్రభుత్వం తమను ఏమనదనే ధైర్యమోగానీ ఆ రెండు కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని పలు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
శ్రీచైతన్య హైదరాబాద్ నుంచే జేఈఈ మెయిన్‌లో ఓపెన్ కేటగిరిలో 10లోపు 4 ర్యాంకులు, 100లోపు 10 ర్యాంకులు.. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 100లోపు 31 ర్యాంకులు తమవేనంటూ ఊదరగొడుతుంటే, మరోవైపు నారాయణ కాలేజీ.. ఆలిండియా టాప్‌లో 100లోపు 30 శాతం ర్యాంకులు, దేశంలోనే 100 పర్సంటైల్ సాధించిన 24 మంది విద్యార్థుల్లో 8 మంది నారాయణ విద్యార్థులదే ప్రభంజనమంటూ ప్రచారం చేస్తోంది.
తమ కాలేజీల్లో చదివితేనే ఈ తరహా ర్యాంకులు వస్తాయని నమ్మబలుకుతున్నాయి. అందులో నిజం ఎంతుందో ఆలోచించకుండా, అదే నిజమనుకొని వెంటనే తమ పిల్లలను ఆయా కళాశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉబలాటపడుతుంటారు.
ఒకే ర్యాంకు రెండు కాలేజీల్లో..
ఈనెల 19న అర్థరాత్రి ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాలకు సంబంధించిన ఒకే ర్యాంకులను శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు వేసుకున్న ఉదంతం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగించింది. లక్షల ఫీజులు దోచుకునేందుకు కళాశాలలు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధంగా ఉంటాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.
జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ఓపెన్ కేటిగిరీలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు తమ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకులను పోటాపోటీగా తమదంటే తమదనేట్లుగా ప్రచురించుకున్నాయి. అయితే ఆ ప్రకటనల వెనుక ఓ పెద్ద మోసం దాగి ఉంది. అదేంటంటే 9వ, 12వ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ విద్యార్థులే అన్నట్లుగా రెండూ కాలేజీలు ప్రచురించుకున్నాయి.
వేరే రాష్ట్రాల్లో వచ్చిన ర్యాంకులను తమ ర్యాంకులుగా
శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు వేరే రాష్ట్రాల్లో వేరే విద్యాసంస్థల్లో వచ్చిన ర్యాంకులను తమ ర్యాంకులుగా ప్రచారం చేసుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. ఆ రెండు కాలేజీలు అడ్మిషన్ల కోసం ఇష్టారాజ్యాంగా తప్పుడు ర్యాంకులను ప్రచారం చేసుకుంటున్నారు. అధికారులు, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలి.
తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న ఈ రెండు విద్యాసంస్థలపై చీటింగ్ కేసు నమోదు చేసి యాజమాన్యాలను వెంటనే అరెస్టు చేయాలి. బ్రాండ్ అంబాసిడర్లుగా సినీ హీరోలు వ్యవహరిస్తూ తప్పుడు ర్యాంకులను ప్రోత్సహిస్తున్నవారిపై కూడా చర్యలు తీసుకోవాలి. తప్పుడు ర్యాంకుల ప్రచారంపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి మేము ఫిర్యాదు చేశాము.
కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు