6 May, 2026 | 8:37 PM

నేను నిర్దోషిని.. నన్ను ట్రాప్ చేశారు!

08-03-2025 01:26 AM

విలపించిన కన్నడ నటి రన్యా రావు

విచారణలో వెలుగులోకి కీలక విషయాలు 

దుబాయ్, అమెరికా,యూరోప్ దేశాలకు ప్రయాణాలు

17 బంగారు బిస్కెట్లు తెచ్చినట్లు ఒప్పుకున్న కి‘లేడీ’

పోలీసుల అదుపులో రన్యా భర్త జతిన్ హుక్కేరి

బెంగళూరు: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అదుపులో ఉన్న రన్యా రావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో నిర్దోషినని చెప్పిన రన్యా.. తనను ట్రాప్ చేయడంతోనే ఈ పనికి ఒప్పుకున్నట్లు విచారణలో తెలిపింది. కేసుకు సంబంధించి తాను వెల్లడించిన విషయాలను రహస్యంగా ఉంచాలని ఈ సందర్భంగా అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తాను బాగా అలసిపోయాయనని.. కొంత సమయం విశ్రాంతినివ్వాలని విచారణ సమయంలో అధికారులను అభ్యర్థించినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తుకు సహకరిస్తానని.. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని రన్యా పేర్కొన్నారు. అంతకముందు విచారణ సందర్భంగా దుబాయ్ మాత్రమే కాకుండా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఇప్పటివరకు యూఏఈ నుంచి 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చినట్లు రన్యా రావు ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. ఇక గతేడాది రన్యా రావు 30 సార్లు దుబాయ్‌కు వెళ్లారని.. కేవలం 15 రోజుల్లో నాలుగుసార్లు.. ప్రతి ట్రిప్‌లో కిలోల కొద్ది బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఒక్కో ట్రిప్‌కు రన్యా రూ. 12 నుంచి 13 లక్షలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. నటి రన్యా రావు తన భర్త జతిన్ హుక్కేరితో కలిసి పలుమార్లు దుబాయ్ వెళ్లినట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తనను ట్రాప్ చేశారంటూ రన్యా రావు విచారణలో పేర్కొనడంతో వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తనకు తెలియకుండా స్మగ్లింగ్ రాకెట్‌లో చిక్కుకుందా? ఆమెకు తెలిసే ఇదంతా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రన్యా రావుకు సవతి తండ్రి కావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది.