చుండూరు హత్యాకాండ నేపథ్యంలో ‘23’.. ఆలోచింపజేస్తున్న మూవీ టీజర్
‘మల్లేశం’, ‘8 పీఎం మెట్రో’ చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ‘23’తో వస్తున్నారు. ప్రచారంలో భాగంగా విడుదల చేసిన పోస్టర్లలో ‘సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?’ అంటూ ప్రశ్నల కొడవళ్లు ఎత్తటంతోనే అందరి దృష్టినీ ఆకర్షించిందీ చిత్రం. ‘చట్టం దృష్టిలో అందరూ సమానం.. కొందరు ఎక్కువ సమానం’ అనే వ్యాఖ్యతో ఆలోచనలో పడిపోయినవారెందరో! స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ సినిమాలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. జైళ్లలో నేరస్తులకు పాఠాలు బోధించే ప్రొఫెసర్ డాక్టర్ బీనా పాత్రలో ఝాన్సీ నటించారు.
పవన్ రమేశ్, తాగుబోతు రమేశ్, ప్రణీత్ తదితరులు మిగతా పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. 1991 చుండూరు హత్యాకాండ, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు.. ఈ మూడు సామూహిక హత్యల నేపథ్యంలో ఈ టీజర్ గ్రిప్పింగ్ నెరేటివ్‌ని ప్రజెంట్ చేసింది. డైరెక్టర్ రాజ్ ఆర్ నైపుణ్యం అతని రచన, దర్శకత్వం రెండింటిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. మూడు విభిన్న కథలను సమర్థంగా బ్లెండ్ చేశారాయన. ప్రధాన నటులు తమ పాత్రలకు ప్రామాణికతను తీసుకువచ్చారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కే రాబిన్ స్కోర్ కథనాన్ని మరింత ఎఫెక్టివ్‌గా ప్రజెంట్ చేశాయి . నిర్మాతలు త్వరలో ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి బ్యానర్: స్టూడియో 99; డిస్ట్రిబ్యూటర్: రానా స్పిరిట్ మీడియా; సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి; సంగీతం: మార్క్ కే రాబిన్; సాహిత్యం: చంద్రబోస్, రెహమాన్, సింధు మార్టిన్; ప్రొడక్షన్ డిజైన్: లక్ష్మణ్ ఏలే; ఆర్ట్ డైరెక్షన్: విష్ణు వర్ధన్ పుల్లా; కాస్టింగ్ డైరెక్షన్: మహేశ్ గంగిమల్ల; డైలాగ్స్: ఇండస్ మార్టిన్; ఎడిటింగ్: అనిల్ ఆలయం; కాస్ట్యూమ్ డిజైన్: శ్రీపాల్ మాచర్ల; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్దారెడ్డి; దర్శకత్వం: రాజ్ ఆర్.






